ఎన్డీయేకు జేపీ మద్దతు-చంద్రబాబు రియాక్షన్ ఇదే..!
ఏపీలో ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తిరిగి అభివృద్ధి కావాలంటే ఎన్డీయేకు మద్దతివ్వాలంటూ జేపీ ఓటర్లకు పిలుపునిచ్చారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
ఎన్డీయేకు ఈసారి ఎన్నికల్లో మద్దతివ్వాలన్న జయ ప్రకాష్ నారాయణ నిర్ణయంపై చంద్రబాబు స్పందిస్తూ ట్వీట్ చేశారు. జేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రగతిశీల, ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ-బీజేపీ-జనసేనతో కూడిన ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని జయప్రకాష్ నారాయణ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఎక్స్ లో చంద్రబాబు పోస్ట్ చేశారు. అలాగే రాష్ట్రంలోని మిగతా భావసారూప్య వ్యక్తులు, సంస్ధలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలన్నారు.

ప్రస్తుతం భయం గుప్పిట్లో ఉన్న రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వీరంతా ముందుకు రావాలని తన పోస్టులో చంద్రబాబు ఓటర్లకు పిలుపునిచ్చారు. మరోవైపు గతంలో టీడీపీ మద్దతుతో హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జయప్రకాష్ నారాయణ.. ఆ తర్వాత మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత లోక్ సత్తా పార్టీకి కూడా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో మద్దతుపై జేపీ చేసిన ప్రకటన చర్చనీయాంశమవుతోంది.













Click it and Unblock the Notifications