వైసీపీకి అస్త్రం? సీఎం అలర్ట్- కీలక ఆదేశాలు..!
ఏపీలో రెండు రోజులుగా అన్నమయ్య జిల్లాలో బయటపడ్డ కల్తీ మద్యం వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికి కారణం కల్తీ మద్యం కేసులో ఇద్దరు టీడీపీ నేతల్ని ఆ పార్టీ సస్పెండ్ చేయడమే. కల్తీ మద్యం కేసుతో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్టొద్దని సీఎం చంద్రబాబు నేరుగా ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని వైసీపీ అందిపుచ్చుకుంది. టీడీపీ నేతలు కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నారంటూ వైసీపీ ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల ఎక్సైజ్ ఆఫీసుల వద్ద ఆందోళనలు చేపట్టింది. దీంతో సీఎం అలర్ట్ అయ్యారు.
రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీ, అమ్మకాలను ఏ మాత్రం ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కల్తీ లిక్కర్‌తో ప్రజల ప్రాణాలను హరించే వారిపై కఠిన చర్యల ద్వారా ఉక్కుపాదం మోపాలన్నారు. 15 నెలల్లో పటిష్ట చర్యల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టామని, ఇంతే సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రంలో కల్తీ లిక్కర్ అనేది లేకుండా చేయాలన్నారు. ఏ ఒక్క చోటా కల్తీ లిక్కర్ తయారీ కేంద్రాలు కానీ, అటువంటి వ్యక్తులు కానీ ఉండకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో తీసుకున్న చర్యలను, దర్యాప్తు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరవు కేసులో మొత్తం 21 మంది నిందితులుగా గుర్తించామని...అందులో ఇప్పటికి వరకు 12 మందిని అరెస్టు చేశామని, మిగతా నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ములకలచెరువు కేసులో ఎ1 గా ఉన్న అద్దేపల్లి జనార్థన్‌రావు లావాదేవీలు, వ్యాపారాలపై విచారణ జరపుతున్నామని తెలిపారు. ముకలచెరువు కేసుల ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్థన్‌రావుకు చెందిన వ్యాపారాలపై తనిఖీలు జరిపామని తెలిపారు.
ఇక్కడ కల్తీ లిక్కర్ వ్యవహారంలో మొత్తం 12 మందిని నిందితులుగా గుర్తించామని వీరిలో ముగ్గురిని ఇప్పటికి అరెస్టు చేశామని తెలిపారు. నలుగురిని పీటీ వారెంట్‌పై తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. నిందితుల కాల్ రికార్డులతో పాటు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. కల్తీ లిక్కర్ వ్యవహారంపై వైసీపీ తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తోందన్నారు.
రాష్ట్రం అంతటా కల్తీ లిక్కర్ అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని, ప్రతి మూడు బాటిల్స్‌లో ఒక బాటిల్ కల్తీ లిక్కర్ బాటిల్ ఉందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం మంత్రులు కూడా అర్థం చేసుకోవాలని, వైసీపీ నేతల కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని సూచించారు. కల్తీ లిక్కర్ కారణంగానే అక్కడ చనిపోయారు...ఇక్కడ చనిపోయారు అని ప్రచారం చేస్తున్నారని.... ప్రతీ ఆరోపణ పైనా విచారణ జరపించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అవసరమైతే పోస్టుమార్టం వంటి విధానాల ద్వారా మృతికి కారణాలు సైంటిఫిక్‌గా నిర్థారించి...వాస్తవాలు వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. ఏది నిజమో చెప్పడంతో పాటు..రాజకీయ కుట్రల్లో భాగంగా సహజ మరణాలపై తప్పుడు ప్రచారాలు చేసేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్తీ లిక్కర్‌తో మరణాలు అని ప్రచారం చేస్తే దానికి రుజువు చూపాలని అడగాలని...తప్పుడు ప్రచారం అని తేలితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దని సీఎం స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications