పింగళి వెంకయ్య కుటుంబాన్ని సత్కరించిన సీఎం జగన్ .. జాతీయ పతాకానికి వందేళ్ళు పూర్తి
జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దాని రూపశిల్పి అయిన పింగళి వెంకయ్య కుటుంబాన్ని శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిశారు. మాచర్లలో పర్యటించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సత్కరించారు. గుంటూరు జిల్లా మాచర్ల లో నివసిస్తున్న ఆయన కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు .
పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి వయసు 99 ఏళ్లు . దీంతో ఆమెను సీఎం జగన్ ఆప్యాయంగా పలుకరించారు . పింగళి వెంకయ్య జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎం జగన్మోహన్ రెడ్డి తిలకించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటుగా పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లిన వారిలో అధికారులతో పాటు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ఇంటికి రావడంపై సీతామహాలక్ష్మి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పింగళి వెంకయ్య కుటుంబాన్ని సన్మానించిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా తాడేపల్లికి వెళ్లనున్నారు. పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం సన్మానిస్తున్న క్రమంలో మీడియాకు అనుమతిని నిరాకరించారు అధికారులు. మరోవైపు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ పేరిట దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి కొనసాగించనున్న ఉత్సవాలలో భాగంగా ఈ ఉత్సవాల నిర్వహణకు కమిటీ సభ్యుడైన సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం ఆజాదీ కా అమృత్ ఉత్సవాల నిర్వహణకు కీలకంగా వ్యవహరించనున్నారు.












Click it and Unblock the Notifications