ఏడుగురిని చంపిన ఆ నరహంతకుడు హతమయ్యాడు: గ్రామస్తుల్లో ఆనందం!

Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం/విజయనగరం: దాదాపు ఏడున్నరేళ్ల క్రితం తన కుటుంబసభ్యులతోపాటు ఏడుగురిని దారుణంగా హతమార్చి రాష్ట్రంలో కలకలం సృష్టించిన మాజీ సీఆర్పీఎఫ్ జవాను మెట్ట శంకరరావును శుక్రవారం దుండగులు చంపేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అతనిపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. కారులో తీసుకెళ్లి హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత మృతదేహాన్ని జలుమూరు మండలం పరిధిలో వంశధార నది ఇసుకలో పూడ్చేశారు. శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. మృతుడు శంకరరావుగా తేల్చారు. జలుమూరు మండలంలోని మెట్టపేటకు చెందిన అతను 2010, నవంబర్‌ 30న రాత్రి స్వగ్రామంలో ఐదుగురు గ్రామస్థులతో పాటు తన ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Cop who killed 7 murdered

శంకరరావు గతంలో సీఆర్‌పీఎఫ్‌లో జవానుగా పనిచేసేవాడు. 2005లో అతని భార్యను హత్య చేసిన నేరం కింద శంకరరావుకు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. ఉద్యోగం కూడా పోయింది. దీంతో సాక్ష్యం చెప్పిన వారిపై కక్ష పెంచుకున్నాడు. మరోవైపు ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేశాడు. అయితే సాక్ష్యులు మరోసారి హైకోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే తనకు ఉరిశిక్ష పడుతుందనే భయంతో వారిపై దాడికి కుట్ర పన్నాడు.

2010, నవంబరులో శంకరరావు బెయిల్‌పై విడుదలయ్యాడు. అదే నెల 30వ తేదీ రాత్రి తన ఇంటిలో నిద్రిస్తున్న తన ఇద్దరు పిల్లలు మహేశ్‌ (9), మానస (6)లతోపాటు మరో ఐదుగురు గ్రామస్తులను దారుణంగా చంపేశాడు. దీంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

కాగా, శంకరరావు దోషిత్వాన్ని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్‌ తగిన ఆధారాలు ప్రవేశపెట్టలేకపోయింది. మానసిక పరివర్తన కోసం ఏడాది పాటు విశాఖపట్నంలోని రామకృష్ణ ఆశ్రమంలో ఉంచాలని శ్రీకాకుళం ఎస్పీని కోర్టు ఆదేశించింది. దీంతో ఇన్నాళ్లూ ఆశ్రమంలో ఉన‍్న శంకరరావు కొద్ది నెలల క్రితం పుట‍్టపర్తి వెళ్లిపోయారు.

అక‍్కడ నుంచి నాలుగు నెలల క్రితమే విజయనగరం జిల్లా బొబ్బిలికి వచ్చాడు. కోస్టల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా ఫెర్రో అల్లాయిస్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలో చేరాడు. కంపెనీకి అర కిలోమీటరు దూరంలో ఉన్న మెట్టవలసలో తోటి ఉద్యోగితో కలిసి ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం విధులకు నడిచి వెళ్తుండగా ఒక వ్యక్తి పదునైన ఆయుధంతో శంకరరావు తలపై కొట్టాడు. దీంతో అతను స్పృహ తప్పి అపస్మారకస్థితికి చేరుకున్నాడు.

ఆ తర్వాత కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ వాహనంలోకి ఎక్కించుకొని తీసుకెళ్లారు. అనంతరం శంకరరావును హత్య చేసి మృతదేహాన్ని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వంశధార నది వద్దకు తీసుకెళ్లి, అక్కడ తుప్పల మధ్య ఇసుకలో పూడ్చేశారు. దీన్ని సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న ఎల్‌ఎన్‌ పేట మండలం దబ్బపాడు గ్రామస్థులు గమనించారు. గుర్తు తెలియని మృతదేహం ఉందనే సమాచారంతో సరుబుజ్జిలి పీఎస్‌ పోలీసులు సాయంత్రం వంశధార నదిలో గాలించారు.

మృతుడిని మెట్ట శంకరరావుగా గుర్తించారు పోలీసులు. బొబ్బిలి, సరుబుజ్జిలి ఎస్సైలు ఎస్‌.అమ్మినాయుడు, బి.అశోక్‌బాబు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని శ్రీకాకుళం డీఎస్పీ భార్గవరావు నాయుడు, ఆమదాలవలస సర్కిల్‌ ఇన్‌స్పెక‍్టర్‌ నవీన్‌కుమార్‌లు శుక్రవారం రాత్రి పరిశీలించారు. కాగా, శంకరరావును తానే హత‍్య చేశానని మెట్టపేటకు చెందిన ఊట ప్రకాశరావు పోలీసులకు చెప్పి లొంగిపోయినట్లు సమాచారం. అయితే పోలీసులు ఇంకా దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఇది ఇలా ఉండగా, గత 12 సంవత‍్సరాలుగా ఆ నరహంతకుడు(శంకరరావు) కారణంగా ఆందోళన చెందుతున్నామని మెట‍్టపేట గ్రామస్తులు అంటున్నారు. శంకరరావు హత్యకు గురైనట్టు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నట్లు చెప్పారు. గ్రామానికి చెందిన ఏడుగురిని హత్య చేసిన హంతకుడు ఇక లేడని తెలియడంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A former constable of the CRPF, Metta Shankara Rao, who had murdered seven persons, including two of his children at Mettapeta area under Jalumuru police station limits in Srikakulam district over family disputes in December 2010, was murdered by some unidentified persons on Friday near Dabbapadu under LN Peta police station limits in Srikakulam district.
Please Wait while comments are loading...