కరోనా టార్గెట్ ... చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా చురకలు .. రోజాపై టీడీపీనేత అనిత విసుర్లు
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి కరోనా వైరస్ కేసులు మాత్రం తగ్గడం లేదు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వాలు శత విధాలా శ్రమిస్తున్నారు . ఇక ఏపీలో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో 348 కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా కట్టడిలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని , తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం లేదని ప్రతిపక్ష టీడీపీ అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబును, టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ మంత్రులు, నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా వర్సెస్ టీడీపీ నేత అనిత
తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా చంద్రబాబు సూచనలు సలహాలు ట్రంప్ కు అవసరమేమో కానీ జగన్ కు అవసరం లేదని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనిత రివర్స్ కౌంటర్ వేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు . చంద్రబాబును విమర్శించే హక్కు వైసీపీ నేతలకు లేదని , విమర్శించే ముందు వైసీపీ నేతలు పదిసార్లు ఆలోచించుకోవాలని ఆమె పేర్కొన్నారు .

చంద్రబాబు సలహాలు ట్రంప్ కు అవసరం అన్న రోజా
ఇక నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసి చైర్మన్ రోజా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాష్ట్రంలో ఉండకుండా, కనీసం కుప్పంలో కూడా ఉండకుండా హైదరాబాద్‌లో కూర్చోని సలహాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏపీ నుంచి అమెరికా వరకు సలహాలు ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు. ఆయన సలహాలు ట్రంప్‌కు అవసరమేమోగానీ, జగన్‌కు అవసరం లేదని రోజా పేర్కొన్నారు . చంద్రబాబు ఎక్కడో హైదరబాద్ లో కూర్చుని సలహాలు చెప్పటం దురదృష్టకరమని పేర్కొన్నారు .

జగన్ భజన బాగా చేస్తున్నారని ఎద్దేవా చేసిన అనిత
రోజా వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ గా అనిత చంద్రబాబు ఎక్కడున్నారన్నది ముఖ్యం కాదని పని విషయంలో ఆయన ఎలా చేస్తారు అన్నదే ముఖ్యం అని పేర్కొన్నారు . ప్రజలకోసం పనిచేస్తున్నామా లేదా అన్నది ముఖ్యమని అనిత రోజాకు హితవు పలికారు . సీఎం జగన్ తాడేపల్లిలో కూర్చొని ప్రెస్‌మీట్‌లు పెట్టడం కాదని అనిత విమర్శించారు. 150 మంది ఎమ్మెల్యేలు జగన్ భజన బాగానే చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు . ఇక ఈ జగన్ భజన చూస్తుంటే ఏ భజన వాళ్లముందు పనికిరాదని అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు .
Recommended Video

మెడ్ టెక్ జోన్ తెచ్చిన ఘనత చంద్రబాబుదే అన్న టీడీపీ నేత
కొంతమంది వైసీపీ నాయకులు చంద్రబాబు వల్ల ఉపయోగం లేదని మాట్లాడుతున్నారని ఇక విశాఖ మెడ్ టెక్ జోన్ వచ్చింది చంద్రబాబు వల్లే అని అనిత గుర్తు చేశారు . విశాఖలో మెడ్ టెక్ జోన్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి అర్థం చేసుకోవాలన్నారు వంగలపూడి అనిత . లాక్ డౌన్ ను గౌరవించి అక్కడకు అంతకు ముందే వెళ్ళిన చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉండి పోయారని, ఆయన ఎక్కడ ఉన్నా ప్రజలకోసం పనిచేస్తున్నారని టీడీపీ మహిళా నేత అనిత స్పష్టం చేశారు.వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications