కాదేదీ క్రియేటివిటీకి అనర్హం.. ఏపీలో అక్కడ విమాన హోటల్!!
అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేదీ కవిత కనర్హం అన్నారు శ్రీశ్రీ.. అయితే కాదేది క్రియేటివిటీకి అనర్హం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కర్నూలు జిల్లాలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు. సామాన్యుల కోసం వారు విమాన హోటల్ ను నిర్వహించటం కోసం రెడీ అయ్యారు.
ఇప్పటివరకు మనం రెస్టారెంట్లకు సంబంధించి బస్సులు, ట్రైన్లు ఇలా రకరకాల ప్రయోగాలను చూశాం. బస్సులలో రెస్టారెంట్లు నిర్వహించడం, ట్రైన్స్ తరహా ఏర్పాట్లు చేసి రైలు బోగీలలో ఆహారాన్ని అందించడం చూసాం. హోటల్స్ లోనే రైల్వే ట్రాకులు, స్టేషన్లు ఏర్పాటు చేసి బుజ్జి ట్రైన్స్ ద్వారా టేబుల్స్ మీదకు ఫుడ్ పంపిస్తున్న హోటల్స్ కూడా ఉన్నాయి.

ఇక ఈ కొత్త కొత్త ప్రయోగాలను భోజన ప్రియులు కూడా ఇష్టంగా వెళ్లి వాటిలో కూర్చుని మరీ అనేక రుచులను ఆస్వాదిస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాకు చెందిన ఓ రెస్టారెంట్ నిర్వాహకులు ఏకంగా విమాన హోటల్ ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అస్సలే విమానం ఎక్కని వారికి విమానం ఎక్కిన అనుభూతిని కలిగించనున్నారు.
కర్నూలు జిల్లా కల్లూరు మండలం దూపాడు పరిధిలో విమానంలో హోటల్ ను నిర్వహించనున్నారు. విమానంలో కూర్చుని ఆహారాన్ని తీసుకునే అనుభూతిని హోటల్ కి వచ్చిన కస్టమర్లు ఆస్వాదించే విధంగా ఈ నూతన రెస్టారెంట్ ను వినూత్నంగా ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఎయిర్ బస్ 320 కి చెందిన విమానాన్ని ఢిల్లీ నుంచి కర్నూలుకు లారీలో తీసుకువచ్చారు. ఇక ఈ విమానాన్ని హోటల్ నిర్వహించడానికి అనుకూలంగా మార్చి హోటల్ ను నిర్వహించనున్నారు.
ఈ విమానం కల్లూరు మండలం దుపాడు కు చేరుకోవడానికి 15 రోజుల సమయం పట్టిందని నిర్వాహకులు చెబుతున్నారు. విమాన ప్రయాణం చేయలేని సామాన్యులు సైతం ఈ విమాన హోటల్లో కూర్చుని భోజనం చేసి, విమానంలో భోజనం చేసిన ఫీల్ ను ఆస్వాదించవచ్చు అని వారు చెబుతున్నారు. మరి ఈ కొత్త ప్రయోగం సదరు హోటల్ నిర్వాహకులకు ఏ మేరకు లాభాలను ఆర్జించి పెడుతుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications