వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో భారీ వర్షాలు-జలదిగ్బంధంలో గ్రామాలు- నిలిచిన రాకపోకలు-రైళ్ల ఆలస్యం

|
Google Oneindia TeluguNews

ఏపీలో గులాబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న రాత్రి తుపాను తీరం దాటడంతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. విశాఖవైపు వెళ్లే పలు రైళ్లు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం జరుగుతోంది. వర్షాలతో రాష్ట్రంలోని పలు జలాశయాలు నిండుకుండలా మారిపోతున్నాయి. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

 ఏపీపై గులాబ్ తుపాన్ ప్రభావం

ఏపీపై గులాబ్ తుపాన్ ప్రభావం

ఏపీపై గులాబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న రాత్రి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం,వజ్రపుకొత్తూరు మధ్య తుపాను తీరం దాటిన తర్వాత మొదలైన వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు పలు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేపడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. విద్యుత్, టెలికాం వ్యవస్ధలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. గులాబ్ తుపాను ప్రభావంతో మొదలైన వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

 వణుకుతున్న ఉత్తరాంధ్ర

వణుకుతున్న ఉత్తరాంధ్ర

గులాబ్ తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై చాలా ఎక్కువగా ఉంది. తుపాను తీరం దాటిన శ్రీకాకుళం జిల్లాతో పాటు దానికి ఆనుకుని ఉన్న విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. భారీ వర్షాల ప్రభావంతో ఈ మూడు జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ముఖ్యంగా విశాఖపట్నంలో గత 30 ఏళ్లలోనే భారీ వర్షం కురిసినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. నిన్నటి నుంచి కేవలం విశాఖలోనే 267 సెం.మీ వర్షం కురిసినట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన తుపానుల కంటే గులాబ్ విశాఖపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కూడా విశాఖలోనే పాగా వేసి పరిస్దితిని సమీక్షిస్తున్నారు.

 విశాఖ వైపు రైళ్ల రద్దు, ఆలస్యాలు

విశాఖ వైపు రైళ్ల రద్దు, ఆలస్యాలు

గులాబ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలవైపు రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా విశాఖవైపు వెళ్లే అన్ని రైళ్లను నిన్న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే... ఇవాళ కొన్ని రైళ్లను ఆలస్యంగా నడపాలని నిర్ణయించింది. ఇందులో చెన్నై నుంచి హౌరా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు.. చెన్నైలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరనుంది. అలాగే విశాఖ-గుంటూరు మధ్య నడిచే 7240 ఎక్స్ ప్రెస్ రైలును ఆలస్యంగా ఇవాళ ఉదయం 10.10కి పంపారు. ఉదయం 10.15కు బయలుదేరాల్సిన యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ రైలును మధ్యాహ్నం 3 గంటలకు పంపుతున్నారు. హుబ్బళ్లి-విజయవాడ అమరావతి ఎక్స్ ప్రెస్ ను మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు బదులుగా సాయంత్రం 5 గంటలకు పంపుతున్నారు.

గ్రామాలకు తెగిన సంబంధాలు

గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల రహదారులపైకి నీరు చేరింది. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులపైనా భారీగా నీరు చేరడంతో చుట్టు పక్కల గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడిన ఘటనలతో రాకపోకలు ఆగిపోయాయి. కిరండోల్ రైల్వే ట్రాక్ పై కొండ చరియలు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలు నిలిపేశారు. అలాగే పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పాటు భారత్ బంద్ కారణంగా బస్సుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో లోతట్టు గ్రామాల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

నిండుకుండల్లా జలాశయాలు

గులాబ్ తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లాలో పలు జలాశయాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మాడుగుల నియోజకవర్గం లో ఏడు జలాశయాలు ఉన్నాయి. అందులో మాడుగుల మండలంలోనే 5 జలాశయాలు ఉన్నాయి.

మండలంలోని పెద్దేరు జలాశయం ప్రమాదస్థాయికి చేరడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి సుమారు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. అదేవిధంగా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం కళ్యాణలోవ జలాశయం కూడా ప్రమాదస్థాయికి చేరుకుంది, దీంతో అధికారులు నాలుగు గేట్ల ద్వారా సుమారు 420 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు.
మాడుగులలో ఉన్నమిగత జలాశయాలు తాచేరు, ఉరకగెడ్డ, గొర్రిగెడ్డ, పాలగెడ్డ వచ్చిన నీరు వచ్చినట్లు పోతుంది. చీడికాడ మండలం కోనాం జలాశయం నుండి కూడా ఎగువ నుండి వచ్చిన నీటిని అలాగే వదిలేస్తున్నారు,

Recommended Video

Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety

ఏపీ సర్కార్ హెచ్చరికలు

గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, జన జీవనం అస్తవ్యస్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాలతో పాటు నదీ ప్రవాహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. సముద్రంలో మత్సకారుల్ని చేపల వేటకు అనుమతించడం లేదు. రోడ్డు, రైలు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకుంటూ ప్రయాణాలు సాగించాలని అధికారులు కోరుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తోంది. అలాగే జలాశయాల్లోకి భారీగా నీటి ప్రవాహాలు చేరుతున్న నేపథ్యంలో జలవనరులశాఖ కూడా అప్రమత్తంగా ఉంటూ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తోంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్ధితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

English summary
several districts in andhrapradesh witness heavy rainfall with cyclone gulab landfall affect for last few hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X