158 మారుమూల గ్రామాలకు రోడ్లు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుంది. ఇందులో ముఖ్యంగా మారుమూల గ్రామాలు కూడా బాగు పడాలని సంకల్పించిన పవన్ కళ్యాణ్ కృషి బాగా కనిపిస్తుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అని నమ్మిన ఆయన ప్లాన్ ఇప్పుడు ఏపీలో మారుమూల గ్రామాలకు పూలబాట వేస్తోంది.
అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పం
రాష్ట్రంలోని చిట్టచివరి గ్రామానికి సైతం అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పం. ఈ క్రమంలో ఇప్పటికే అడవితల్లి బాట పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎన్నో గిరిశిఖర గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లో సైతం జనజీవనానికి దూరంగా విసిరేసినట్టు ఉండే మారుమూల పల్లెలు, ఆవాసాలకు, కుగ్రామాలకు రోడ్లను వేయనున్నారు.

మరో 158 మారుమూల గ్రామాలకు అనుసంధాన రహదారులు
మారుమూల కుగ్రామాలకు రోడ్లను, అభివృద్ధిని పరిచయం చేసేందుకు పవన్ కళ్యాణ్ రూపొందించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనున్నాయి. మరో 158 మారుమూల గ్రామాలకు అనుసంధాన రహదారులు నిర్మించేందుకు పరిపాలన అనుమతుల ప్రక్రియ పూర్తయ్యింది. 347 కిలోమీటర్ల పొడవున, 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.422.10కోట్ల నిధులు మంజూరు
ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, కడప, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పూర్తి రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి, అంచనాలు రూపొందించారు. ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రూ. 422.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
ఈ గ్రామాలకు తొలిసారి రోడ్డు సౌకర్యం
ఐదేళ్లపాటు ఈ రోడ్ల నిర్వహణ నిమిత్తం మరో రూ.24.47 కోట్లు విడుదలయ్యాయి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఈ సందర్భంగా అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి సహకారంతో 158 ఆవాసాలకు తొలిసారి రోడ్డు సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
రహదారి సౌకర్యం లేని గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయం
మారుమూల గ్రామాలకు నిర్మించే రోడ్ల నాణ్యత విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. మనం వేసే రోడ్లు పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలన్నారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేలా రోడ్లు, వంతెనల నిర్మాణంతో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడి, ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మార్కెటింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.













Click it and Unblock the Notifications