విజయవాడ ప్రజలకు ఎంపీ కేశినేని బిగ్ అలర్ట్ ! వరద ముప్పు వేళ..!
ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్నటి నుంచీ పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వీటి ప్రభావం అమరావతి రాజధాని పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలపై కూడా కనిపిస్తోంది. ఇదే క్రమంలో విజయవాడ నగరానికి బుడమేరు ముప్పు పొంచి ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే అధికారులు మాత్రం అదేమీ లేదంటున్నారు. అయితే ఇవాళ భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ కేశినేని చిన్ని ప్రజలకు కీలక సూచన చేశారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ లో బుడమేరు వంతెనను ఎంపీ కేశినేని శివనాథ్ ఇవాళ ప్రభుత్వ విప్, స్ధానిక ఎమ్మెల్యే బోండా ఉమతో కలిసి పరిశీలించారు. 58వ డివిజన్ ఇందిరా నాయక్ నగర్ భరతమాత గుడి రోడ్డులో బుడమేరు కాలువను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా గతేడాది వచ్చిన వర్షాలకు బుడమేరు వాగు పొంగి విజయవాడకి వరద ముంచెత్తిందని,వాగుకి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో అక్కడ రిటైనింగ్ వాల్ కట్టామని చిన్ని తెలిపారు.

కృష్ణా నది నుంచి 3,80,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఎంపీ కేశినేని వెల్లడించారు. ప్రస్తుతం బుడమేరు వాగు నియంత్రణలోనే ఉందన్నారు. ప్రస్తుతనికి బుడమేరు నుండి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. వచ్చే వర్షం కాలం నాటికి బుడమేరు వాగు సమస్యకి శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అయితే విజయవాడ నగర ప్రజలు ఎవరు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకి రావద్దని ఎంపీ కేశినేని సూచించారు.

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ , మంత్రి నారాయణ వరద పరిస్థితి పై గంట గంటకీ పర్యవేక్షణ చేస్తున్నట్లు చిన్ని తెలిపారు. వదంతుల్ని నమ్మొద్దని ప్రజల్ని కోరారు. విజయవాడకు భవిష్యత్తులో బుడమేరు వాగు ముప్పు ఉండదని ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. వర్షపు నీరు తప్ప బుడమేరు వాగు నీరు విజయవాడకి వచ్చే అవకాశం లేదన్నారు. దానికి తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications