AP Election: ఏపీలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు..!
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో మూడు రోజుల సమయమే మిగిలుంది. ఓవైపు రాజకీయ నేతల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఈసీ బదిలీ వేట్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో డీజీపీ సహా 10 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ.. తాజాగా కింది స్థాయి అధికారులపైనా కొరడా ఝళిపిస్తోంది. ఇదే క్రమంలో సమస్యాత్మక ప్రాంతమైన పల్నాడు జిల్లాలో ముగ్గురు పోలీసు అధికారులపై వేటు పడింది.
పల్నాడు జిల్లాలో ఇద్దరు సీఐలు, ఓ ఎస్సైని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. వీరిని తక్షణం విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు పంపింది. ఈసీ బదిలీ వేటు పడిన వారిలో పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ సీఐ శరత్, కారెంపూడి సీఐ చిన మల్లయ్య, వెల్దుర్ది ఎస్సై వంగా శ్రీహరి ఉన్నారు. వీరిని ఎన్నికల విధుల నుంచి తక్షణం తప్పుకోవాలని ఈసీ ఆదేశించింది.వీరి స్ధానంలో ప్రత్యామ్నాయ అధికారులను నియమించనుంది.

పల్నాడు జిల్లాలో ఈసారి ఎన్నికలకు ముందే హింస చోటు చేసుకుంటోంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల దాడులు, ప్రతిదాడుల్లో నిన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాతో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఎన్నికల పోలింగ్ సమయంలోనూ ఇక్కడ దాడులు జరగొచ్చని ఈసీ అంచనా వేస్తోంది. దీంతో కోడ్ ఉల్లంఘనలకు పాల్పడినా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి హింసకు కారణమైనా పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది.












Click it and Unblock the Notifications