వచ్చే ఎన్నికల్లో పోటీ చేయట్లేదు-వైసీపీ యువ ఎంపీ సంచలన ప్రకటన...
ఏపీలో ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్ధుల్లో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీలుగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలుగానూ, ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ఎంపీలుగానూ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రులు కూడా ఎంపీలుగా వెళ్తారన్న ప్రచారమూ ఉంది. కానీ వీటిలో ఎక్కడా ప్రచారంలో లేని ఓ అధికార పార్టీ ఎంపీ మాత్రం తాను వచ్చే ఎన్నికల్లో అసలు పోటీ చేసేది లేదని ఓ సంచలన ప్రకటన చేశారు.
2019 ఎన్నికల్లో తొలిసారి ఏలూరు ఎంపీగా వైసీపీ టికెట్ గా గెలిచిన కోటగిరి శ్రీధర్ ఈ ఐదేళ్లలో ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు. ఏలూరులో ఉన్న రాజకీయాలే ఇందుకు కారణమనేది అందరికీ తెలిసిన విషయమే. ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని అధిష్టానంతో తనకు ఉన్న సంబంధాలతో ఎంపీ కోటగిరి శ్రీధర్ ను కట్టడి చేయడంతో ఆయన హంగామా ఎక్కువగా కనిపించలేదు. దీంతో ఎలాగోలా ఈ ఐదేళ్ల పదవీకాలం గడిపేసి మరోసారి పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.ఈ మేరకు నిన్న జరిగిన వెలమ సంఘం సమావేశంలో కోటగిరి శ్రీధర్ కీలక ప్రకటన చేశారు.

ఏలూరు నుంచి ఎంపీగా మరోసారి తాను పోటీ చేయడం లేదని కోటగిరి శ్రీధర్ వెల్లడించారు. అయితే ఇందుకు వ్యక్తిగత కారణాలను ఆయన చెప్పుకున్నారు. తన కుమారుడు స్కూల్లో చదువుతున్నాడని, మరో ఐదేళ్లు తాను ఎంపీగా ఉంటే తను కాలేజీకి వస్తాడని, తాను రాజకీయాల్లో బిజీగా ఉంటే తనను గుర్తుపట్టే పరిస్దితి కూడా ఉండదని వ్యాఖ్యానించారు. అందుకే ఈసారి ఎంపీగా పోటీలో ఉండటం లేదని కోటగిరి శ్రీధర్ క్లారిటీ ఇచ్చేసారు.
కానీ జిల్లాలో రాజకీయాల్ని దగ్గరి నుంచి గమనిస్తున్న వారు మాత్రం కోటగిరి శ్రీధర్ మరోసారి ఎంపీగా పోటీ చేయకపోవడమే మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఎంపీగా కోటగిరి శ్రీధర్ తన ముద్ర వేసుకోలేకపోయారు. మళ్లీ ఎంపీగా గెలిచినా ఇదే పరిస్ధితి ఉంటుందని చెప్తున్నారు. దీంతో కోటగిరి నిర్ణయం సరైనదే అన్న భావన వైసీపీలో సైతం వ్యక్తమవుతోంది. కోటగిరి శ్రీధర్ ఎంపీగా పోటీకి దూరం కావడంతో ఆయన స్ధానంలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనానిని ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications