తన మాజీ ఓస్డీతోనే ఆర్కే రోజాపై విచారణ! కూటమి సర్కార్ లో మరో చిత్రం..!
ఏపీలో నాలుగు నెలల క్రితం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వానికి ఓ చిక్కు వచ్చి పడింది. తన వారెవరో, పరాయి వారెవరో తేల్చుకోలేని పరిస్ధితి. ఓవైపు గత వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికీ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ అప్పటి అక్రమాలపై విచారణ చేయిస్తున్న కూటమి సర్కార్.. మరోవైపు అప్పట్లో ఇందుకు కారణమైన వారిని తమకు తెలియకుండానే అక్కున చేర్చుకుంటోంది. దీంతో కూటమి పార్టీల్లోనే ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇదే క్రమంలో తాజాగా వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యవహారం ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. గతంలో పర్యాటక మంత్రిగా వ్యవహరించిన ఆర్కే రోజా అప్పట్లో పలు అక్రమాలకు పాల్పడినట్లు కూటమి నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. వీటిలో ఆడుదాం ఆంధ్రతో పాటు విశాఖలో టూరిజం ప్రాజెక్టుల ఫర్నిచర్ మాయం వంటి ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఓ సీనియర్ అధికారిని నియమించి నిష్పాక్షిక విచారణ చేయించాల్సిన ప్రభుత్వం ఆమె మాజీ ఓఎస్టీనే విచారణాధికారిగా నియమించడం సంచలనం రేపుతోంది.

గతంలో పర్యాటశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్కే రోజాకు ఓఎస్డీగా వ్యవహరించిన రాజారాం మనోహర్ ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఇతర బాధ్యతల్లోకి వెళ్లిపోయారు. అయితే ఆర్కే రోజా హయాంలో విశాఖ, తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టుల్లో విలువైన ఫర్నిచర్ మాయం అయిన వ్యవహారంపై విచారణ చేయించాలని నిర్ణయించిన ప్రభుత్వం విచారణాధికారిగా రోజా మాజీ ఓఎస్టీ రాజారాం మనోహర్ కు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన విచారణ కొనసాగిస్తున్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రస్తుత పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తాజా రివ్యూలో దీనిపై అధికారులకు ప్రశ్నల వర్షం కురిపించారు. అంతే కాదు స్వయంగా రాజారాంను సైతం పిలిపించి రోజా దగ్గర పనిచేశారా లేదా అని నిలదీసారు. దీంతో ఆయన అంగీకరించారు. అయితే విచారణ మాత్రం నిష్పాక్షికంగా చేసి నివేదిక ఇస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన్ను తప్పించలేక మంత్రి దుర్గేష్.. సమాంతరంగా అధికారుల కమిటీతోనే విచారణ చేయించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వంలో పాలన ఎలా సాగుతోందో జనం చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications