Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్టు..! రీజన్ ఇదే..
రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు కాలం కలిసి రావడం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న నందిగం సురేశ్ తాజాగా బెయిల్ రావడంతో కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి ఆయనపై ఇంకో కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఏకంగా అరెస్టు కూడా చేశారు. దీంతో వైసీపీ నేతల వరుస అరెస్టుల క్రమంలో ఇది కూడా చేరిపోయింది.
గుంటూరు జిల్లా ఉద్దండరాయుని పాలానికి చెందిన టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై నిన్న రాత్రి వైసీపీ నేత నందిగం సురేశ్ దాడికి పాల్పడ్డారు. సోదరుడు ప్రభుదాస్, బంధువులతో కలిసి టీడీపీ కార్యకర్తపై ఆయన దాడి చేసారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసులు.. ఇవాళ మధ్యాహ్నం ఉద్దండరాయుని పాలెంలో వైసీపీ నేత నందిగం సురేశ్ ను అరెస్టు చేశారు.

అయితే టీడీపీ కార్యకర్త రాజుపై నందిగం సురేశ్ తో పాటు ఆయన బంధువులు దాడి చేయడం వెనుక కీలక కారణాలు వెలుగుచూశాయి. నిన్న రాత్రి ఉద్దండరాయుని పాలెంలోకి ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. ఇదే కారులో ఉన్న టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు .. తన డ్రైవర్ ను కారు వేగంగా నడపటంపై మందలించారు. అంతలోనే అదే ఊరిలో ఉన్న నందిగం సురేశ్, అతని బంధువులు అక్కడికి చేరుకుని రాజును ఎత్తుకెళ్లారు. సురేశ్ ఇంట్లోనే అతనిపై దాడికి పాల్పడ్డారు. దీంతో రాజుకు గాయాలయ్యాయి. అతన్ని బంధువులు మంగళగిరిలోని ఎయిమ్స్ లో చేర్చి చికిత్స ఇప్పిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నందిగం సురేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని సోదరుడు ప్రభుదాస్ తో పాటు దాడికి పాల్పడిన ఇతర బంధువులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నందిగం సురేశ్ పై దాడి, హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications