జగన్ సర్కార్ కు హైకోర్టు వార్నింగ్-ప్రైవేటుస్కూళ్లలో పేదలకు సీట్లిస్తారా ? మీకు జైల్లో సీట్లిమ్మంటారా ?
ఏపీలో విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా పేదలకు ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయించే వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వంపై మండిపడింది. ప్రైవేటు స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు కేటాయించాలని విద్యాహక్కు చట్టం చెప్తున్నా ప్రభుత్వం మాత్రం విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ప్రభుత్వంలో కీలకమైన సీఎస్ తో పాటు విద్యాశాఖ అధికారులు ఇరుకునపడ్డారు.

పేదలకు ప్రైవేటులో 25 శాతం సీట్లు
ఏపీలో విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా పేద విద్యార్ధులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధనను అమలు చేయకపోవడంపై దాఖలైన పిటిషన్లను గతంలోనే విచారించిన హైకోర్టు.. దీన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తీర్పు ఇచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం ఆదేశాలు ఇచ్చినా అమల్లో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటోంది. దీంతో పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కోర్టు ధిక్కాక వాజ్యం దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించింది.

జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్
ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్ధులకు విద్యాహక్కు చట్టం కింద 25 శాతం సీట్లు తప్పనిసరిగా కేటాయించాలని గతంలో తాము ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం దాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం మొదటి తరగతిలో 25 శాతం సీట్ల భర్తీ సరిగ్గా లేదని హైకోర్టు ఆక్షేపించింది.
2022-23 విద్యాసంవత్సరానికి అంటే ఈ ఏడాదికి ప్రైవేటు స్కూళ్లలో పేదలకు సీట్లు కేటాయించాల్సిందేనని తాము ఇచ్చిన ఆదేశాల్ని ప్రభుత్వం సరిగ్గా అమలుచేయకుండా ప్రైవేటు స్కూళ్లకు సాయం చేస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

వాళ్లకు సీట్లివ్వకపోతే మీకు జైల్లో సీట్లిస్తాం..
ఈ విద్యాసంవత్సరంలో అన్ని ప్రైవేటు స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు కేటాయించినట్లు నిరూపించుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. లేకపోతే మీకు జైళ్లలో సీట్లు కేటాయిస్తామంటూ హైకోర్టు సీఎస్, విద్యాశాఖ అధికారులను హెచ్చరించింది. అంటే సీట్ల కేటాయింపులో విఫలమైనట్లు తేలితే జైలుకు పంపుతామంటూ హైకోర్టు హెచ్చరించినట్లయింది. విద్యార్దులు స్కూల్లో అయినా ఉండాలి, లేదా మీరు జైల్లో అయినా ఉండాలంటూ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ ఏడాది ప్రైవేటు స్కూళ్లలో ఎంతమంది పేద పిల్లలకు సీట్లిచ్చారో చూపించలేకపోతే వ్యక్తిగతంగా హాజరు అయి అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications