AP Election: ఏపీలో పెరిగిన మహిళల ఓటింగ్ ఎవరికి అనుకూలం ?
ఏపీలో నిన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో భారీ ఎత్తున మహిళా ఓటర్లు తరలివచ్చి ఓటేశారు. గత ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకూ క్యూలో నిలబడి వారు నిలబడి వారు వేసిన ఓట్లు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ లెక్కల్ని మార్చబోతున్నాయన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అసలేం జరిగిందో తెలుసుకుందాం..
రాష్ట్రంలో గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తమ సంక్షేమ పథకాలన్నింటినీ దాదాపుగా మహిళా కేంద్రంగా మార్చేసింది. ముఖ్యంగాగత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను సైతం మహిళల పేరు మీదకు మార్చేసింది. దీంతో ఐదేళ్ల పాటు పథకాల డబ్బులన్నీ మహిళల ఖాతాల్లో చేరడం, వారే కుటుంబ పెద్దల్లా కనిపించడం జరిగింది. ఇది ఓ విధంగా మహిళల గుండెల్లో సీఎం జగన్ కు ప్రత్యేక స్ధానాన్ని కల్పించేలా చేసింది.

మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీయే కూటమి అప్పటివరకూ వైసీపీకి అనుకూలంగా మారిన మహిళా ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే లక్ష్యంతోనే సూపర్ సిక్స్ పథకాలను రూపొందించింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇప్పటికే ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని ఇంట్లో ముగ్గురు పిల్లల వరకూ విస్తరించడం, మహిళలకు ఏటా మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితం వంటి పథకాలు వారిని ఆకట్టుకునేవే.
ఇలా వైసీపీ, టీడీపీ కూటమి రెండూ మహిళా ఓటర్ల విషయంలో పోటాపోటీగా వ్యవహరించాయి. దీంతో ఈసారి ఎన్నికల్లోనూ ఆ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఎన్నికల ముందు నుంచే మహిళా ఓటర్లు వైసీపీకి అనుకూలమన్న ప్రచారం జరిగింది. పోలింగ్ లోనూ మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో ఈ వాదన నిజమైందన్న చర్చ సాగుతోంది. అయితే టీడీపీ కూటమి మాత్రం తమ పథకాలకు ఆకర్షితులై మహిళలు ఇలా తమను గెలిపించడానికి భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని చెబుతోంది. ఇందులో ఏది నిజమో మరో 20 రోజుల్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications