చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీని ఎదిరించిన తొలి సీఎంను నేనే:వెంకన్నతో పెట్టుకుంటే నాశనమే!:చంద్రబాబు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

చిత్తూరు:చిత్తూరు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని ఎదిరించిన తొలి ముఖ్యమంత్రిని తానే అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కేంద్రంతో పోరాటం చేస్తుంటే వైసిపి మాత్రం లోపాయి కారీ ఒప్పందాలు పెట్టుకొని రాష్ట్రానికి అన్యాయం చేస్తోందన్నారు.

దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని...ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ పవిత్రతను దెబ్బ తీస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే నామరూపాలుండవని...ఈ జన్మలోనే దానికి తగిన శిక్ష అనుభవిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపి,వైసిపిలను శాపనార్థాలు పెట్టారు.

ఇఫ్తార్ విందులో...సిఎం ఆవేదన

ఇఫ్తార్ విందులో...సిఎం ఆవేదన

ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా జామియా మసీదులో ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున చిత్తూరు జిల్లా మదనపల్లెలో గురువారం సాయంత్రం ముస్లిం మైనారిటీ సోదరులకు ఇఫ్తార్‌విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. "ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించిన మొదటి ముఖ్యమంత్రిని నేనే. గోద్రా అల్లర్ల సమయంలో, ఇటీవల ట్రిపుల్‌ తలాక్‌ విషయంలోని కొన్ని అంశాలపై ఆయన్ను వ్యతిరేకించా. నాపై వ్యక్తిగత కక్ష పెంచుకున్న ఆయన రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదు. నిధులు ఇస్తే మనమెక్కడ బలపడి భవిష్యత్‌లో ఆయనకు అడ్డు వస్తామేమోనన్న భయం పట్టుకుంది. అందుకే ప్రత్యేక హోదాపై మాటతప్పారు"...అని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ...మైనారిటీల పక్షపాతి

టీడీపీ...మైనారిటీల పక్షపాతి

"ఆవిర్భావం నుంచీ టీడీపీ మైనారిటీల పక్షపాతిగానే ఉంది. 2014లో రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి కొంత మంది మైనారిటీ సోదరులు నొచ్చుకున్నా బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సి వచ్చింది' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనారిటీలు టీడీపీని ఆదరించారు. అయితే బీజేపీతో పొత్తు కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో పాక్షికంగా నిరాదరించారు"అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము అన్నింటికీ సిద్ధపడి కేంద్రంతో పోరాటం చేస్తుంటే...వైసీపీ మాత్రం బీజేపీతో లోపాయకారీ ఒప్పందాలతో రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నాయకులు అడగకపోయినా వైసీపీ నాయకులు మద్దతు తెలిపారని విమర్శించారు.

వెంకన్నతో పెట్టుకుంటే...నాశనమే

వెంకన్నతో పెట్టుకుంటే...నాశనమే

అంతకుముందు చిత్తూరు జిల్లా వలపపల్లెలోని జవహర్‌ నవోదయ విద్యాలయం ఆవరణలో గురువారం సాయంత్రం నవ నిర్మాణదీక్ష సభలో ఆయన మాట్లాడారు. "దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బ తీస్తున్నారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే నామరూపాలుండవ్‌. ఈ జన్మలోనే దానికి తగిన శిక్ష అనుభవిస్తారు"...అని ముఖ్యమంత్రి శాపనార్థాలు పెట్టారు. వెంకన్న దయవల్లే తాను తీవ్రవాదుల దాడి నుంచి బతికి బయటపడ్డానని చెప్పారు. ఏనాడూ తిరుమల పవిత్రత దెబ్బ తీసే ప్రయత్నం చేయలేదని చంద్రబాబు చెప్పారు.

వెంకన్న సాక్షిగా...మోడీ మోసం

వెంకన్న సాక్షిగా...మోడీ మోసం

"వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ చెప్పి మోసం చేశారు. నిన్నటి దాకా తిరుమల పూజారితో నాపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఆయనతో నన్ను తిట్టించారు. మరోవైపు తిరుమల ఆలయాన్ని ఆర్కియాలజీ శాఖ ద్వారా స్వాధీనం చేసుకుని పెత్తనం చెలాయించేందుకు కేంద్రం ప్రయత్నించింది. ప్రజలు తిరగుబాటు చేయడంతో భయపడి వెనక్కి తగ్గింది. ఈరోజు రమణదీక్షితులు హైదరాబాద్‌ వెళ్లి జగన్మోహన్‌రెడ్డిని కలిసి మంతనాలు జరిపారు. నాపై ఏం కుట్ర పన్నుతున్నారో" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వెంకన్న సాక్షిగా తాను పిలుపిస్తే కర్ణాటక ప్రజలు బీజేపీని ఓడించారని చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం తప్పితే రాజకీయ లబ్ధి కోసం కాదని స్పష్టంచేశారు. బీజేపీతో పొత్తు లేకుంటే టీడీపీకి మరో 15 సీట్లు పెరిగేవన్నారు.

రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్ర...

రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్ర...

"ఎన్నికల ప్రచారంలో తిరుపతిలో స్వామి సాక్షిగా మోదీ రాష్ట్రాభివృద్ధికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చేది లేదని...హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని మాట మార్చారు. ప్యాకేజీ కూడా ఇవ్వకపోగా తర్వాత కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. దానిపై ప్రశ్నిస్తే కేంద్రం నుంచి సమాధానం లేదు. అయినా ఓపికగా 29 సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి నిధుల కోసం ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. చివరగా ఐదో బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి న్యాయం జరగకపోవడంతో రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని గ్రహించి కేంద్ర మంత్రివర్గం నుంచి బయటికొచ్చాం...ఎన్డీఏ నుంచీ వైదొలిగాం. ఆ వెంటనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. టీడీపీకి ఉన్న విశ్వసనీయత కారణంగా వంద మంది ఎంపీలు మద్దతిచ్చారు"...అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. బీజేపీతో పొత్తు తెగిపోగానే పవన్‌ కల్యాణ్‌ కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

నిప్పులా బతికా...బురదజల్లే ప్రయత్నం

నిప్పులా బతికా...బురదజల్లే ప్రయత్నం

ఎయిర్‌ ఏషియాలో ఇద్దరు ప్రయాణికులు తన గురించి మాట్లాడుకున్నారంటూ తనపై బురదజల్లే ప్రయత్నం చేశారని చంద్రబాబు చెప్పారు. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే దానికీ తనకూ సంబంధమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. తానే తప్పూ చేయలేదని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికానన్నారు. తన కులం పేదరికమని, అర్హులందరికీ న్యాయం చేస్తానని అన్నారు. వైసీపీ వంటి పార్టీలకు మద్దతిస్తే రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. వారికి మద్దతిస్తే ప్రజలను కూడా జైలుకు తీసుకెళ్తారు అని చంద్రబాబు హెచ్చరించారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్రాన్ని సంపూర్ణ ఓడీఎఫ్ గా ప్రకటించారు.
ప్రజలు ఆనందంగా.. ఆరోగ్యంగా ఉండటమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం అన్నారు. సిమెంట్‌రోడ్లు, పచ్చదనం, పల్లెవనం లాంటి అభివృద్ధి పనులతో చండ్రమాకులపల్లె చాలా బాగుందని చంద్రబాబు చెప్పారు.

English summary
Chittoor: AP CM Chandra babu has made sensational comments in the Chittoor district tour. He is the first Chief Minister to oppose Modi.We are fighting against the Center for state purposes and the YCP is doing injustice to the state by taking secret contacts with BJP,said Chandra babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X