AP Rains : ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు-ఎక్కడెక్కడంటే ?
ఏపీలో తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు తాజాగా రుతుపవనాల ప్రభావంతో తొలకరి జల్లులు పలకరించాయి. అయితే ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. అసలే జూన్ మొదటివారంలో రావాల్సిన వర్షాలు కాస్తా చివరి వారంలో మొదలయ్యాయి. రెండు, మూడు రోజుల పాటు కాస్త ఊరటనిచ్చినా తిరిగి ఎండలు మొదలయ్యాయి. గత రెండు, మూడు రోజులుగా ఏపీలో తిరిగి రెండో వేసవి మొదలైనట్లు కనిపిస్తోంది.
తిరిగి వేసవి ఉక్కపోత మొదలైందని భావిస్తున్న తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆయా చోట్ల ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. రాయలసీమతో పాటు కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు పడతాయని వెల్లడించింది.

పడమటి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో సాధారణ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వెల్లడించింది. గాలుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి.
ఈ నెలలో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే జూన్ నెలలో ఆశించిన దాని కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులు నాట్లు వేసేందుకు ఎదురుచూస్తున్నారు. జూలైలోనూ సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైతే ఇబ్బందులు తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications