ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ మహాశిల్పం ఆవిష్కరణ: ప్రజలకు సీఎం వైఎస్ జగన్ పిలుపు!!
విజయవాడలో అంబేద్కర్ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు తన సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న, అంబేద్కర్ గారి మహా శిల్పం మన రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం అని కితాబిచ్చారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నారు. ఇది సామాజిక న్యాయ మహా శిల్పం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ నెల 19న, చారిత్రక, స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్న ఈ విగ్రహం, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని పేర్కొన్న ఆయన ఇది 81 అడుగుల వేదిక మీద, ఏర్పాటు చేసిన... 125 అడుగుల మహా శిల్పం అంటే, 206 అడుగుల ఎత్తైన విగ్రహమని చెప్పారు. ఆ మహానుభావుడిది ఆకాశమంతటి వ్యక్తిత్వం అన్నారు.

ఈ దేశ సామాజిక,ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రల్ని మార్చేలా, దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు. ఆయన సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపమని కొనియాడారు. ఆయన అంటరాని తనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన మహానుభావుడని, అణగారిన వర్గాలకు చదువు నందించిన మహనీయుడు అని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగాన్ని రాసి తద్వారా ఆయన నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి అంబేద్కర్ అన్నారు. బాధ్యతతో, ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో, వాటిని మన నవరత్నాల్లో, అనుసరిస్తున్న ప్రభుత్వంగా.., ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా, 19వ తేదీన అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతున్నాను అని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం.., అణగారిన వర్గాలకు నిరంతరం.., ధైర్యాన్ని, అండని ప్రసాదించే ఓ మహా స్ఫూర్తిగా సీఎం జగన్ కొనియాడారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి భావాలు కుల మతాలకు అతీతమైనవని కాబట్టే, ఆయన్ను ఇంతగా గౌరవించుకుంటున్నామన్నారు. ఇప్పుడు మన విజయవాడలో, ఆవిష్కరిస్తున్న ఈ మహా శిల్పం.., మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటం మాత్రమే కాకుండా, చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తినిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications