5 లక్షలకే సరికొత్త 3డీ ప్రింటెడ్ ఇల్లు! బుర్రిపాలెంలో భారీ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలోని బుర్రిపాలెం గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్-2.0) పథకం కింద రూపుదిద్దుకోనున్న 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంయుక్తంగా భూమిపూజ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఓ లబ్ధిదారు నివాస స్థలంలో ఇద్దరూ స్వయంగా శంకుస్థాపన చేసి, ఆ కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు బహూకరించి ఆప్యాయంగా పలకరించారు. తమ ఇంటి నిర్మాణాన్ని ప్రధాని ప్రతినిధులైన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం పట్ల లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక '3డీ కాంక్రీట్ ప్రింటింగ్' సాంకేతికతతో ఇళ్లను నిర్మించే పైలట్ ప్రాజెక్ట్‌కు కూడా ఈ వేదికగానే శ్రీకారం చుట్టారు. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాలలో మొదటి విడతగా 177 మోడల్ ఇళ్లను ఈ నూతన పద్ధతిలో నిర్మించనున్నారు. ఈ సాంకేతిక సహకారం కోసం రూర్కీకి చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ 'సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' (సీబీఆర్‌ఐ) తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తక్కువ వ్యయంతో, తక్కువ సమయంలోనే ఎంతో పటిష్టమైన నిర్మాణాలు సాధ్యమవుతాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇళ్లు ఎండ తీవ్రతను తట్టుకుని, లోపల తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా ఈ కొత్త టెక్నాలజీతో డిజైన్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు
ఈ సరికొత్త 3డీ ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి ఇంటికి రూ.5.10 లక్షల వ్యయాన్ని ఖరారు చేశారు. సాధారణంగా పీఎంఏవై కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చే రూ.2.39 లక్షల ఆర్థిక సాయానికి అదనంగా, నూతన సాంకేతికతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని నిధులను సమకూరుస్తోంది. కేవలం గోడలు, స్లాబ్ వేయడమే కాకుండా.. స్థల అభివృద్ధి, మెట్లు, మరుగుదొడ్డి, ర్యాంప్, షెడ్ వంటి అన్ని రకాల మౌలిక వసతులను ఈ బడ్జెట్‌లోనే పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పీఎంఏవై గ్రామీణ్-2.0 కింద మొత్తం 3 లక్షల ఇళ్లు మంజూరు కాగా, గతంలో ఇచ్చిన 75 వేల గృహాలకు తోడుగా తాజాగా మరో 2.25 లక్షల ఇళ్లకు కేంద్రం తుది అనుమతులు ఇచ్చింది.














Click it and Unblock the Notifications
