జగన్ సర్కార్ కీలక నిర్ణయం- ఆ కాలేజీల్లో ఎంఈసీ స్ధానంలో ఇక ఎంపీసీ, బైపీసీ
ఏపీలో ఇప్పటికే భారీ ఎత్తున విద్యాసంస్కరణలు చేపడుతున్న వైసీపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉన్న కోర్సుల స్ధానంలో డిమాండ్ ఉన్న కోర్సుల్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ముందుగా ఎస్సీ గురుకులాల్లో ఈ నిర్ణయం అమలు చేయనుంది.
ఎస్సీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ లో విద్యార్థుల నుంచి పెద్దగా డిమాండ్ లేని ఎంఇసి స్థానంలో సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. బీ.ఆర్.అంబేద్కర్ గురుకులాల కార్యకలాపాలపై సచివాలయంలో జరిగిన సమీక్షలో ఈ ఆదేశాలిచ్చారు.

గురుకులాల్లోని 1.17 లక్షల సీట్లలో 1.09 లక్షల సీట్లు భర్తీ అయ్యాయని, ఖాళీగా మిగిలిపోయిన సీట్లలో ఎక్కువగా ఇంటర్మీడియట్ సీట్లే ఉన్నాయని మంత్రి నాగార్జున తెలిపారు. ఇంటర్ లో ఎంపీసీ, బైపీపీ వంటి సైన్స్ సీట్ల కోసం పోటీ పడుతున్న విద్యార్థులు ఎంఇసి సీట్లలో చేరడానికి ముందుకు రాని కారణంగానే సీట్లు ఖాళీగా మిగిలే పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎంఇసి కోర్సుల స్థానంలో విద్యార్థులు ఎక్కువగా కోరుకుంటున్న ఎంపీసీ, బైపీసీ సీట్లను ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులు ప్రారంభమైయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థులకు జాబ్ గ్యారెంటీ ఇచ్చే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సులను జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఎస్సీ గురుకులాల్లో విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చడానికి అమలు చేస్తున్న విధానాలపై ప్రిన్సిపాళ్లు, డీసీఓలు దృష్టి పెట్టేలా చూడాలని, ఈ విషయంలో బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించే ప్రిన్సిపాళ్లు, డీసీఓలపై చర్యలు తీసుకోవాలని కూడా నాగార్జున అధికారులను ఆదేశించారు.ఈ నేపథ్యంలోనే విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. బాగా చదివి మంచి మార్కులు సాధించే విద్యార్థులకు తరగతుల స్థాయిలో ప్రోత్సాహక బహుమతులను ఇచ్చే పథకాన్ని తీసుకురావాలని సూచించారు.












Click it and Unblock the Notifications