ఉప్పొంగిన గోదావరి.. ముంచెత్తిన వరద, మునిగిపోయిన ప్రసిద్ధ ఆలయాలు!
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీనికి తోడు ఎగువన ఉన్న ప్రాజెక్టుల తలుపులు ఎత్తివేసి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో తీరప్రాంతాలు జలమయమయ్యాయి. నాసిక్ లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రాంతమైన రామ్‌కుండ్, గోదా ఘాట్ పరిసరాల్లోని పలు చిన్న చిన్న ఆలయాలు పూర్తిగా నీటి మునిగిపోయాయి. అక్కడి ప్రసిద్ధ 'దూతోండ్యా మారుతి' విగ్రహం నీటిలోనే మునిగిపోవడంతో వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిండిన జలాశయాలు.. గేట్లు ఎత్తివేత
వరద ఉధృతికి ప్రధాన కారణం నాసిక్ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన ప్రాజెక్టులు నిండిపోవడమే. నాసిక్ నగర తాగునీటి అవసరాలు తీర్చే గంగాపూర్ డ్యామ్ దాదాపు 98 శాతానికి పైగా నిండిపోవడంతో అధికారులు వేలాది క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. జిల్లాలోని మొత్తం జలాశయాల నీటిమట్టం ఇప్పటికే 72 శాతానికి చేరుకుంది. త్రయంబకేశ్వర్, సుర్గాణా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో గంగాపూర్, దార్ణా, దేవ్ నది ప్రాజెక్టుల నుంచి నీటిని దాదాపు ప్రతి గంటకూ ప్రవాహాన్ని పెంచుతూ కిందకు విడుదల చేస్తున్నారు.

స్తంభించిన ప్రజాజీవనం.. పొలాల్లోకి చేరిన వరద
ఈ అకస్మాత్తు వరదల వల్ల నాసిక్ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక చోట్ల వందలాది ఎకరాల్లో ఉన్న పంటపొలాలు నీటమునిగాయి. పలుచోట్ల పాత భవనాలు కూలిపోగా, దాదాపు 51కి పైగా భారీ వృక్షాలు నేలకూలాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో దాదాపు 27 రహదారులపై రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. నిఫాడ్ తాలూకాలోని పలు వారధులు నీట మునిగిపోవడంతో చుట్టుపక్కల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇళ్లలోకి, దుకాణాల్లోకి నీరు చేరడంతో జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
యుద్ధపాతిపదికన సహాయక చర్యలు
వర్షాల ధాటికి సుర్గాణా తాలూకాలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలు పశువులు కూడా కొట్టుకుపోయాయి. నదీ పరివాహక, ముంపు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 200 మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది వైపు ఎవరూ వెళ్లకూడదని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నాయి.












Click it and Unblock the Notifications