దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి కొండ భూములపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం .. ఆ 120 ఎకరాలు బదలాయింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెజవాడ కనకదుర్గమ్మ కొండపై ఉన్న భూములపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్ర కీలాద్రి భూములపై ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడం కోసం జగన్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. బెజవాడ దుర్గమ్మ కొండపై కొలువుతీరినా, ఆ కొండపై ఉన్న ప్రాంతమంతా ఆలయ బోర్డు అధీనంలో లేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ ఆ భూముల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది

కొండపైన అటవీశాఖ ఆధీనంలోనే మొత్తం భూములు
కొండ మీద ఉన్న ప్రాంతమంతా అటవీప్రాంతం కావడంతో అది అటవీ శాఖ ఆధీనంలో ఉంది. ఆలయ ప్రాంగణంతో సహా అటవీ శాఖ అధీనంలో ఉండటంతో అక్కడ ఏ పని చేయాలన్నా, ఏ అభివృద్ధి పనులు మొదలు పెట్టాలన్నా అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిసారి అనుమతులు తీసుకోవడం ఆలయ అధికారులకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న 120 ఎకరాల భూమి మొత్తాన్ని ఆలయ బోర్డుకు అప్పగించాలనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది.

ఆలయ ట్రస్ట్ బోర్డ్ అధీనంలోకి ఇవ్వాలని ప్రతిపాదన
ఇటీవల జరిగిన దుర్గగుడి ఆలయ బోర్డు సమావేశంలో కూడా కొండను ఆలయ ట్రస్టు బోర్డుకు అప్పగించాలని ప్రతిపాదన పెట్టారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొండను ఆలయ ట్రస్టు బోర్డు అప్పగించటం పై నిర్ణయం తీసుకున్నా అది ఇప్పటివరకు అమలులోకి రాలేదు. దీంతో ప్రస్తుతం అటవీ శాఖ పరిధిలో ఉన్న ఇంద్రకీలాద్రి భూమిని దుర్గ ఆలయ బోర్డుకు బదలాయించడం పై జగన్ సర్కారు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ బదలాయింపుకు సంబంధించిన ఫైల్ కదిలినట్లు గా అధికారులు చెబుతున్నారు .

ఆలయాల అభివృద్ధి , కొండ చరియలు విరిగి పడకుండా చర్యలు తీసుకుంటామంటున్న ట్రస్ట్ బోర్డు
ఇక ఆలయ బోర్డు ఇంద్రకీలాద్రి కొండను తమకు కేటాయించాలని కోరడం వెనుక మరో కారణం కూడా ఉంది.
ఇంద్రకీలాద్రి పర్వతం కొండలు ఇటీవల కాలంలో తరచుగా విరిగి పడుతున్న నేపథ్యంలో, కొండ చరియలు విరిగి పడకుండా దానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తమ పరిధిలోనే ఉంటే తాము చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఆలయం ఉన్న స్థలానికి ఉన్న చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యతను బట్టి ఆలయాలను అభివృద్ధి చేయడం, భక్తులకు కావలసిన వసతి సౌకర్యాల కల్పన కోసం చేపట్టాల్సిన పనులకు ప్రతిసారి అటవీశాఖ అనుమతులు తీసుకోవడం పెద్ద ఇబ్బందిగా తయారైంది.

భూముల బదలాయింపుకు పని మొదుపెట్టిన అధికారులు
ఒకవేళ కొండపై ఉన్న భూమిని బెజవాడ దుర్గమ్మ ట్రస్ట్ బోర్డుకు కేటాయిస్తే ఆలయ పనులను అభివృద్ధి చేయడమే కాకుండా, కొండ చరియలు విరిగి పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి బోర్డు పనిచేస్తుందని వారంటున్నారు.
ఇంద్రకీలాద్రిపై ఉన్న 120 ఎకరాలు కనక దుర్గమ్మ అమ్మవారి దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా , భూముల బదలాయింపు సంబంధించి కలెక్టర్ సైతం పని మొదలు పెట్టారు.

దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులకు 70కోట్ల రూపాయలు కేటాయించిన సీఎం జగన్
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలయ అభివృద్ధి పనుల కోసం 70 కోట్ల రూపాయలు కేటాయించగా , కొండ దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు అప్పగిస్తే గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులను చేపట్టి ముందుకు వెళ్తామని బోర్డు సభ్యులు చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక ఇంద్రకీలాద్రి కొండ దుర్గా ట్రస్ట్ బోర్డ్ అధీనంలోకి రానుంది.