ఏపీ న్యాయరాజధాని కర్నూల్లో మరో ఆఫీసు ప్రారంభం..
ఏపీలో మూడు రాజధానుల వివాదం ఇంకా సుప్రీంకోర్టులోనే ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇవాళ న్యాయరాజధాని అయిన కర్నూల్లో మరో ప్రభుత్వ కార్యాలయం ప్రారంభించింది. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణ మోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్డీలతో పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ఛైర్మన్ జి.భూపాల్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతియాజ్, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణ మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కర్నూలులో రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని తెలిపారు.

వీటికి అదనంగా అవసరం లో ఉన్న ప్రజలకు న్యాయం చేసేందుకు వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ కూడా చేరిందన్నారు. కేసుల పరిష్కారంలో ట్రిబ్యునల్, సభ్యులకు బార్ మెంబర్స్ తగిన సహకారం అందించాలని ఆయన కోరారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, సంబంధిత అంశాలలో సమర్థవంతంగా న్యాయం అందించాలన్నదే వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ అంతిమ లక్ష్యం అని, అందరి సహకారంతో ఈ లక్ష్యాన్ని సాధించాలని ఆయన పిలుపు నిచ్చారు.

రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రైబ్యునల్ ను తొలుత విజయవాడలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మారిన పరిస్దితుల్లో న్యాయరాజధాని అయిన కర్నూల్లో ఏర్పాటు చేయాలని తాజాగా మార్చిన ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం ఇవాళ కర్నూల్లో వక్ఫ్ బోర్డు ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు. దీంతో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అన్ని వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏళ్ల తరబడి కబ్జాల్లో ఉన్న వక్ఫ్ భూముల వ్యవహారాలకూ త్వరగా పరిష్కారం లభించనుంది.












Click it and Unblock the Notifications