వైఎస్సార్ రాక్షసుడా .. బూతుల మంత్రులు గాజులేసుకుని కూర్చున్నారా : జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, అలాగే దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దోపిడీలో తండ్రిని మించిన తనయుడు జగన్ అంటూ, వైయస్సార్ రాక్షసుడు అంటూ నోటికొచ్చినట్టు తిట్టిపోస్తున్నారు. అయితే జల వివాదాల నేపథ్యంలో తాజాగా తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై టిడిపి నాయకుడు తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.

పెద్ద మనిషిని బండ బూతులు తిడుతుంటే ఏం చేస్తున్నారు ?
దివంగత సీఎం వైఎస్సార్ పై తెలంగాణ మంత్రులు నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఒకరిద్దరు మంత్రులు మినహాయించి ఎవరూ స్పందించలేదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైయస్ తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనిషిని బండ బూతులు తిడుతుంటే ఏపీలో మంత్రులు ఏం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.

బూతుల మంత్రులు గాజులు తొడుక్కుని కూర్చున్నారా ?
బండ బూతులు తిట్టటంలో ఆరితేరిన ఏపీ మినిస్టర్లు ఇప్పుడు గాజులు తొడుక్కున్నారా అంటూ నలుగురు మంత్రులు బూతులు తిట్టే మంత్రులు ఉన్నారంటూ, వారంతా ఏం చేస్తున్నారంటూ టార్గెట్ చేశారు. తెలంగాణకు ద్రోహం చేశారని, వైయస్ రాజశేఖర్ రెడ్డి రాక్షసుడని తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఆయన చేసిన వ్యాఖ్యలను ఇక ముందెప్పుడూ చెయ్యొద్దంటూ విజ్ఞప్తి చేశారు.
Recommended Video

హైదరాబాద్ లో సెటిలర్స్ ఎవరు? హాట్ కామెంట్స్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి
హైదరాబాదులో ఉన్న మన వాళ్ళ కోసమే సంయమనం పాటిస్తున్నామని వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాదులో సెటిలర్స్ ఎవరు అని నిలదీశారు. హైదరాబాద్ తో తెలుగు ప్రజలకు విడదీయరాని అవినాభావ సంబంధం ఉందని, తన పిల్లలు హైదరాబాద్లోనే పుట్టి పెరిగారని, అక్కడే చదువుకున్నారని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేస్తున్నారంటూ జెసి వ్యాఖ్యానించారు. ఇక మొన్నటివరకూ జేసీ ట్రావెల్స్ అక్రమాల కేసులో ఇరుక్కుని సైలెంట్ గా ఉన్న జేసీ బ్రదర్ మరోమారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న జల వివాదం పై తాజాగా చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications