తగ్గేదేలే.. వర్షంలోనూ తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష!!
తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ మాత్రం తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు. మున్సిపల్ కమిషనర్ పై అవినీతి ఆరోపణలు చేసిన ఆయన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్, రీజినల్ డైరెక్టర్ దీక్షా శిబిరం వద్దకు రావాల్సిందేనని జెసి ప్రభాకర్ రెడ్డి పట్టుబడుతున్నారు. జోరున వర్షం కురుస్తున్నా, తాడిపత్రి మున్సిపల్ ఆవరణలోనే టెంట్ వేసుకుని నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
గత రెండు రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునిచ్చి పోలీసులు అడ్డుకుంటున్నా సరే వెనక్కి తగ్గకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. మొన్న రాత్రి ఇంటినుండి మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోగా డివైడర్లపైనే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఆ తర్వాత అర్ధరాత్రి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని అక్కడే నిద్రించి, నిన్న ఉదయం మునిసిపాలిటీ ఆవరణలోనే స్నానంచేసి వినూత్న నిరసన తెలియజేశారు.

నిన్న రాత్రి కూడా మున్సిపాలిటీ ఆవరణలోనే నిద్రించి, ఉదయం అక్కడే స్నానం చేసి మళ్లీ దీక్ష మొదలు పెట్టారు. ఇక తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం లో దీక్ష చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి సంఘీభావంగా టిడిపినేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తున్న టెంట్ వద్దకు చేరుకున్నారు. అధికారులు వచ్చే వరకు దీక్షను విరమించేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
మునిసిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయని, కమిషనర్ తో పాటు అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పెన్నా నదిలోని ఇసుక అక్రమ రవాణాతో పాటు, తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించాలని, దీక్షా శిబిరం వద్దకు రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి భీష్మించుకు కూర్చున్నారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications