మళ్లీ హైకోర్టుకు వైఎస్ అవినాష్ రెడ్డి-ఆ రోజు ఏం జరిగిందో ఇమ్మంటూ..
ఏపీలో నాలుగేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా సీబీఐ విచారిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి పలు విజ్ఞప్తులు చేశారు. వాటిపై హైకోర్టు మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో గతంలో వేసిన పిటిషన్ పై ఇవాళ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.
వివేకా హత్య కేసులో తనపై సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ మేరకు సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి గుర్తుచేస్తూ ఆ విచారణకు సంబంధించిన రికార్డు ఇవ్వాలంటూ అవినాష్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో వేసిన పిటిషన్ లోనే మధ్యంతర పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు హైకోర్టుకు అవినాష్ న్యాయవాది తెలిపారు.

మార్చి 14న తనపై సీబీఐ జరిపిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తాజా మధ్యంతర పిటిషన్ లో తెలంగాణ హైకోర్టును కోరారు. ఇప్పటివరకూ సీబీఐ నాలుగుసార్లు అవినాష్ ను విచారించగా.. మార్చి 14న విచారణ రికార్డు కోసం మాత్రమే ఆయన హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో సీబీఐ విచారణపై దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వచ్చే వరకూ విచారణ ఆపాలని కోరినా హైకోర్టు మాత్రం సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు విచారణ రికార్డు కోరడం సంచలనం రేపుతోంది.












Click it and Unblock the Notifications