వివేకా కేసులో అవినాష్ కు సీబీఐ నోటీసులు-తీసుకునేందుకు నిరాకరణ? ఇవాళ కడప కోర్టు నుంచి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ విఫలయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంంది. దీంతో సీబీఐ కడప కోర్టు ద్వారా ఆయనకు నోటీసులు ఇప్పించబోతోందని తెలుస్తోంది. అదే జరిగితే ఈ కేసులో భారీ మలుపు ఖాయం.

వివేకా హత్యలో అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ, సీఎం జగన్ సోదరుడు కూడా అయిన వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర కీలకంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐకి వాంగ్మూలాలు ఇచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సాక్ష్యులు, నిందితులు కూడా అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించడంతో ఆయన్ను ప్రశ్నించే విషయంలో సీబీఐ ఎందుకు తాత్సారం చేస్తోందనే చర్చ కూడా జరిగింది. అవినాష్ రెడ్డికీ, వివేకాకూ ఉన్న శత్రుత్వమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీబీఐ తదుపరి చర్యలు ఉత్కంఠ రేపుతున్నాయి.

అవినాష్ కు సీబీఐ నోటీసులు ?
తన పెదనాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ఇప్పటికే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎంపీ కావడంతో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ఉన్నతాధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారమే ఆయన్ను ప్రశ్నించి, తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. దీంతో అవినాష్ ను ప్రశ్నించడం ఖాయంగా కనిపిస్తోంది.

కడప కోర్టు నుంచి నోటీసులు ?
సీబీఐ అధికారులు నేరుగా ఇచ్చిన నోటీసులు అవినాష్ రెడ్డి తీసుకోలేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీబీఐ అధికారులు కడప కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఈ కేసును పర్యవేక్షిస్తున్న కడప కోర్టు నుంచి ఆయనకు ఇవాళ నోటీసులు ఇప్పించవచ్చని సమాచారం. అదే జరిగితే సీబీఐ విచారణకు అవినాష్ హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు పరిణామాలు ఎలా మారొచ్చనే అంశంపైనా ఉత్కంఠ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ పెద్దలు సహా కడప నేతలు కూడా అవినాష్ కు అండగా నిలుస్తున్న నేపథ్యంలో సీబీఐ తదుపరి చర్యలు ఎళా ఉండబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది.

అవినాష్ ను అరెస్టు చేస్తారా ?
సీబీఐ అధికారులు ఇప్పటికే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న వారితో పాటు నిందితుల్ని కూడా అరెస్టు చేసి జైళ్లకు పంపారు. ఈ కేసులో ప్రస్తుతానికి అనుమానితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన తర్వాత ఆయన్ను నిందితుడిగా చూపుతారా లేదా అన్నది తేలుతుంది. సీబీఐ విచారణకు అవినాష్ సహకరిస్తే సరే సరి. లేకపోతే ఆయన్ను అరెస్టు చేసి కస్టడీలోకి కూడా తీసుకనే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న సీఎం జగన్.. సోదరుడి కోసం ఢిల్లీ పెద్దలతో మాట్లాడి సీబీఐ దూకుడుకు అడ్డుకట్టే వేసినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications