'పొత్తుపై వెంకయ్య చెప్పారు.. అమిత్ షా ఏం చేస్తారో, బాబుపై అసంతృప్తి'
తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
గుంటూరు: తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టిడిపితో పొత్తు విషయంలో కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, సోము వీర్రాజు వంటి నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం తెలిసిందే.
చదవండి: జగన్‌ను వెనుకేసుకొచ్చిన బీజేపీ
వారు ఎప్పటికప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తేనే బాగుంటుందని చెబుతున్నారు. అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. దీనిపై కన్నా మాట్లాడారు.

వెంకయ్య చెప్పారు.. అమిత్ షా ఏం చేస్తారో..
వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉంటుందని వెంకయ్య నాయుడు చెప్పారని, అయితే ఎన్నికల నాటికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని వ్యాఖ్యానించారు.

టిడిపితో పొత్తుపై బీజేపీలో అసంతృప్తి
టిడిపితో పొత్తు విషయంలో బీజేపీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఇదే విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లామని కన్నా చెప్పారు. దీనిపై కమిటీ వేసి విచారణ జరుపుతున్నామని అమిత్ షా చెప్పారన్నారు.

పొత్తుపై నివేదికకు కమిటీ
కన్నా వ్యాఖ్యల ద్వారా బీజేపీలో ఢిల్లీ స్థాయిలో అంతర్గతంగా టిడిపితో పొత్తుపై చర్చలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. కమిటీ ఇచ్చే నివేదికను బట్టి టిడిపితో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా తేలనుందని అంటున్నారు.

టిడిపి ఇలా.. బిజెపి అలా..
వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని ఇటీవల సీఎం చంద్రబాబు చెప్పారు. మరోవైపు, ఏపీలో కొందరు బీజేపీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి కూడా ఇటీవల ఘాటు లేఖ రాసిన విషయం తెలిసిందే.
బీజేపీ పెద్దలు కూడా టిడిపితో పొత్తుకు అనుకూలంగా ఉన్నప్పటికీ... స్థానికంగా ఉన్న బీజేపీ నేతల అభిప్రాయం తీసుకోవడంతో పాటు, ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి మసలుకుంటారనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications