కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని; తిరువూరులో అన్నదమ్ముల వర్గీయుల బాహాబాహీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీలలో జరుగుతున్న వ్యవహారాలు ఆసక్తికరంగా మారాయి. అధికారం కోసం అధినేతలు వ్యూహాలు రచిస్తుంటే పార్టీ నాయకులలో అంతర్గత కుమ్ములాటలు ఇబ్బందిగా మారుతున్నాయి. తాజాగా బెజవాడలో తెలుగుదేశం రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి.
ఒకపక్క టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారం చేపట్టాలని భావిస్తుంటే మరోపక్క పార్టీ నేతల మధ్య, అందునా అన్నదమ్ముల మధ్య చోటు చేసుకున్న వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారి రోడ్డెక్కటం చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి.అంతా కలిసి పని చెయ్యాల్సిన చోట చిన్న చిన్న విషయాలకే పార్టీ నేతలు కుమ్ములాటలకు పాల్పడటం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.

తాజాగా తిరువూరులో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాలు బాహబాహికి దిగాయి. ఈనెల ఏడవ తేదీన తిరువూరులో చంద్రబాబు సభ ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై స్థానిక నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొనడానికి కేశినేని నాని, కేశినేని చిన్ని తిరువూరు వెళ్లారు. అయితే ఫ్లెక్సీలో కేశినేని నాని ఫోటోలు లేకపోవడంతో నాని వర్గం ఫ్లెక్సీలు చింపి కుర్చీలను విరగొట్టి ఆందోళనకు దిగింది.
అంతేకాదు నియోజకవర్గ ఇన్చార్జి దత్తు పై కూడా కేశినేని నాని వర్గం ఆందోళన చేపట్టింది. నాని వర్గీయులు చించేసిన ఫ్లెక్సీలలో పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయని జనసైనికులు నిరసనకు దిగారు. దీంతో వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సమావేశంలో పాల్గొనకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు.
కేశినేని నాని vs కేశినేని చిన్ని. తిరువూరు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో భగ్గుమన్న విభేదాలు..!#KesineniNani #KesineniChinni #Tiruvuru #TDP #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/9c8rXvpKV3
— oneindiatelugu (@oneindiatelugu) January 3, 2024
ఇక తాజా పరిణామాలను తెలుసుకున్న కేశినేని చిన్ని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ఆయనను అడ్డుకోవడానికి కేశినేని నాని వర్గం ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో బెజవాడ బ్రదర్స్ పాలిటిక్స్ పీక్స్ కు చేరినట్లుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. మరి తాజా పరిణామాలతో చంద్రబాబు వీరిద్దరి వ్యవహారంలో ఏం చర్యలు తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications