పవన్ కళ్యాణ్ కు అభినందనలు - ఢిల్లీ పెద్దలకు జానీ మూవీ చూపించాలి : కొడాలి నాని సెటైర్లు...!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మంత్రి కొడాలి నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేసిన డెడ్ లైన్ పైన రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్,.. చంద్రబాబుకు భయపడే వ్యక్తులు ఇక్కడ ఎవరూ లేరంటూ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జ్ఞానోదయం కలిగిందని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఉద్యమం చేయడానికి ఇప్పటికైనా ముందుకు వచ్చారని, పవన్ కళ్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.

మంత్రి నాని టార్గెట్ పవన్
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డెడ్ లైన్లు పెట్టడం ఏంటని ఎద్దేవా చేసారు. జనసేన చనిపోయిన పార్టీ అని...ఢిల్లీ వెళ్లి ప్రధానికి డెడ్ లైన్లు పెట్టాలని సూచించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వారం రోజుల్లో ఆపకపోతే ఏదో ఒకటి చేస్తానంటూ గతంలో నటించిన జానీ వంటి పాత సినిమాలను వాళ్ళకు చూపించాలని సెటైర్ వేసారు. అది డెడ్ పార్టీ కదా, రెండు చోట్ల పోటీ చేసి ఆయనే గెలవలేదని ఎద్దేవా చేసారు.చచ్చిన పార్టీ డెడ్ లైన్లు పెట్టక ఏ లైన్లు పెడుతుందని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

జానీ మూవీ వారికి చూపించండంటూ
ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి లేఖ రాసారని..అఖిల పక్షం గురించి అడిగిన విషయాన్ని వైసీపీ మంత్రులు గుర్తు చేస్తున్నారు. పవన్ కేంద్రాన్ని ప్రశ్నించకుండా తమ ప్రభుత్వాన్ని నిలదీయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశం పైన ఇప్పటికే మంత్రి అప్పలరాజు సైతం స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు ఆయన అజ్ఞానాన్ని సూచిస్తున్నాయని విమర్శించారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలనుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని... అలాంటప్పుడు బీజేపీని ప్రశ్నించాలని అన్నారు.

వైసీపీని కాదు..బీజేపీని అడగాలంటూ
బీజేపీని పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా అనడం లేదని అప్పలరాజు విమర్శించారు. వ్రైవేటీకరణ అంశంలో వైయస్ఆర్‌సీపీకి సంబంధం లేకపోయినా తమ పార్టీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్న బీజేపీకి తిరుపతి, బద్వేల్ ఎన్నికల్లో పవన్ ఎలా మద్దతిచ్చారని ప్రశ్నించారు. అయితే, పవన్ కళ్యాణ్ విధించిన వారం రోజుల డెడ్ లైన్ లోగా స్పందించకపోతే తాము కార్యాచరణ ప్రకటిస్తామంటూ పవన్ వెల్లడించారు. అయితే, ప్రభుత్వం నుంచి ఆ డెడ్ లైన్ పైన స్పందన వస్తుందా రాదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications