ఏపీలో మరో రెండు కొత్త విమానాశ్రయాలు, కేంద్రం ఆమోదం..!!
ఏపీలో మరో రెండు కొత్త విమానాశ్రయాలు రానున్నాయి. ఈ మేరకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికల తయారీకి కూడా అనుమతి మంజూరు చేసింది. ఈమేరకు టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీ ఎల్) సిద్ధమైంది. ఈ రెండు విమానాశ్రయాల నిర్మాణానికి పౌర విమానయాన శాఖ సైట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సైతం జారీ చేయటంతో.. ఇక నిర్మాణ షెడ్యూల్ ఫిక్స్ చేయనున్నారు.
ఏపీలో మరో రెండు కొత్త ఏయిర్ పోర్టుల నిర్మాణ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చుతున్నాయి. అందులో భాగంగా కేంద్రం నుంచి అనుమతులు దక్కాయి. కుప్పం, శ్రీకాకుళంలో విమానాశ్రయాల నిర్మాణానికి సివిల్ ఏవియేషన్ శాఖ సైట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చేసింది. అదే విధంగా ఈ రెండు విమానాశ్రయాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికల తయారీకి అనుమతి ఇచ్చింది. దీంతో, టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్) సిద్ధమైంది. రక్షణ మంత్రిత్వశాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్(డీజీసీఏ), ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల మార్గదర్శకాలకు లోబడి అనుమతులు తీసుకోవాలని నిర్దేశించింది. కాగా.. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ నుంచి ఎన్ఓసీ పొందాలని స్పష్టం చేసింది.

కేంద్రం మార్గదర్శకాలు
కాగా.. విమానాశ్రయాలను నిర్మించే ప్రదేశాలకు 150 కి.మీ. పరిధిలోని సివిలియన్ ఎయిర్పోర్టు లపై థర్డ్ పార్టీ ఇంపాక్ట్ ఎసెస్మెంట్ రిపోర్టు అందించాలని పేర్కొంది. నెట్ జీరో సాధించటానికి వీలుగా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తీసుకునే చర్యలు డీపీఆర్, ఎయిర్పోర్టు మాస్టర్ ప్లాన్లో చేర్చాలని స్పష్టం చేసింది. శ్రీకాకుళం విమానాశ్రయానికి ఈ ఏడాది మే 6న, కుప్పం విమానాశ్రయానికి జూన్ 15న ఏపీఏడీసీఎల్ సైట్ క్లియరెన్స్ల కోసం దరఖాస్తు చేయగా మూడు, నాలుగు నెలల్లోనే అనుమతులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా కుప్పం లో 1,788 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 1,300 ఎకరాలు సేకరించింది. కుప్పం విమానాశ్రయాన్ని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంతో బండ్లింగ్ చేయించాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
