ఏపీలో మళ్లీ లాక్ డౌన్- తిరగబెట్టిన కరోనా వ్యాప్తి - ఆందోళనలో సర్కార్...
కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గిందని భావిస్తున్న సమయంలో ఏపీలో మరోసారి తిరగబెట్టింది. పలు జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగింది. దీంతో ముందుగా చెప్పినట్లుగానే తిరిగి లాక్ డౌన్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి పూర్తిగా లాక్ డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. గతంలో లాగానే ఆయా జిల్లాల్లో అన్ని ఆంక్షలు అమలు కాబోతున్నాయి, వీటితో పాటు మిగతా జిల్లాల్లోనూ భారీగా పరీక్షల నిర్వహణకూ ప్రభుత్వం సన్నద్దమవుతోంది.
Recommended Video

మళ్లీ లాక్ డౌన్ ఆంక్షలు...
దేశమంతా అన్ లాక్ 1.0 కొనసాగుతున్న వేళ ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి భారీగా పెరిగిపోవడంతో తిరిగి లాక్ డౌన్ విధించాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో ఏకంగా 465 కేసులు నమోదు కావడంతో పరిస్ధితి చేజారుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మూడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. లాక్ డౌన్ విధించే, సడలించే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకే కట్టబెట్టడంతో ఎప్పటికప్పుడు పరిస్దితిని సమీక్షించి వారే నిర్ణయాలు ప్రకటిస్తున్నారు.

మూడు జిల్లాల్లో లాక్ డౌన్ ప్రాంతాలివే...
ప్రస్తుతం కేసులు ఎక్కువగా ఉన్న ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. వీటిలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, చీరాలలో, అనంతపురం జిల్లాల్లోని అనంతపురం టౌన్, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని పలాసలోనూ తిరిగి లాక్ డౌన్ విధించారు. ఈ మూడు జిల్లాలూ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు కావడం, ఇక్కడ ప్రజల్లో వైరస్ వ్యాప్తిపై అవగాహన తక్కువగా ఉండటం వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది.

మరో మూడు జిల్లాల్లో భారీగా పరీక్షలు..
లాక్ డౌన్ తో సంబంధం లేకుండానే కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో భారీగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. జ్వరం,దగ్గు వంటి సమస్యలతో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయాలని సూచించారు. ఆయా జిల్లాలో రోజుకు 3వేల టెస్టులు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చారు. మిగతా జిల్లాల్లోనూ రోజుకు 1000 నుంచి 1500 వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రైమరీ, సెకండరీ సర్వే లెన్స్ బృందాలు మరింత చురుగ్గా పనిచేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశాలు వచ్చాయి.

పెరుగుతున్న మరణాల రేటు...
ప్రభుత్వ అప్రమత్తతకు మరో కారణం రాష్ట్రంలో తాజాగా పెరుగుతున్న మరణాల రేటు. గత నెలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో తక్షణం వైరస్ నియంత్రణ చర్యలపై దృష్టిసారించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఇందుకు భారీగా పరీక్షల నిర్వహణే మార్గమనే అంచనాకు వచ్చారు. దీంతో మరోసారి భారీగా కరోనా టెస్టుల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications