వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై- టీడీపీ నుంచి కొడుకు రాఘవరెడ్డికి టికెట్ ?
ఏపీలో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇవాళ సొంత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాల్ని నిజం చేస్తూ వైసీపీని వీడుతున్నట్లు ఇవాళ ప్రకటించారు. ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టి తన రాజీనామాతో పాటు మాగుంట కుటుంబం గత కొన్నేళ్లుగా జిల్లా ప్రజలతో మమేకమైన తీరును ఆయన వివరించారు. ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం ఓ బ్రాండ్ అని, అయితే వైసీపీలో ఆత్మగౌరవం లేక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా తనయుడు మాగుంట రాఘవరెడ్డితో పోటీ చేయించాలని నిర్ణయించినట్లు శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. ఆత్మగౌరవం కలిగిన మాగుంట కుటుంబం .. కొన్ని అనివార్య కారణాలతో వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గత ఐదేళ్లుగా మాగుంట కుటుంబానికి సహకరించిన సీఎం వైఎస్ జగన్ తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. వైసీపీని వీడటం బాధగానే ఉందన్నారు.
ప్రకాశం జిల్లాలో తమ కుటుంబాన్ని మరోసారి ఆశీర్వదించాలని మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. ఆత్మగౌరవ సమస్య వల్లే వైసీపీని వీడుతున్నామని, దీన్ని అందరూ అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. మరోవైపు వైసీపీకి గుడ్ బై చెప్పిన మాగుంట శ్రీనివాసులురెడ్డి.. త్వరలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఆయన తనయుడు రాఘవరెడ్టికి ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications