ఏపీలో అడ్రెస్ లేని సీఎంగా చంద్రబాబు; ఆయన ఫ్యామిలీ హైదరాబాద్‌లో: మంత్రి బొత్సా కౌంటర్
2024 వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్రం చట్టం చేసిందని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి బొత్సా రివర్స్ ఎటాక్ చేశారు.

ఏపీకి నాలుగో రాజధాని హైదరాబాద్... టీడీపీ నేతల వ్యాఖ్యలకు బొత్సా కౌంటర్
మూడు రాజధానులు పోయి ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్ వచ్చిందని టిడిపి నేతలు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా వైసిపి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాజధానిని ప్రశ్నార్థకం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి నేతల వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

ఏపీలో అడ్రెస్ లేని సీఎంగా చంద్రబాబు ఐదేళ్ళు పాలన: బొత్సా
తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బొత్ససత్యనారాయణ మనిషి పొడుగు పెరగడం కాదు కొంచెం బుర్ర పెరగాలి అంటూ అచ్చెన్నాయుడు ని టార్గెట్ చేశారు. ప్రతిపక్షాల నేతలు అవగాహన లేకుండా వ్యంగంగా మాట్లాడుతూ ఉండటం బాధాకరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేని సీఎంగా చంద్రబాబు ఐదేళ్లు పని చేయడం దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఫ్యామిలీతో హైదరాబాద్ లో ఉండొచ్చు కానీ ..
చంద్రబాబు అండ్ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉండి ఎంజాయ్ చేస్తారు కానీ తాము హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని అంటే మాత్రం టిడిపి నేతలకు ఎందుకు అభ్యంతరం వస్తుందో చెప్పాలని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు హైదరాబాదులో ఉండి పరిపాలన సాగించారు అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబంతో సహా ఇప్పటికీ హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉండాలని విభజన చట్టం చెప్పిందని తాను చెప్పానని, అంతే గానీ తాము హైదరాబాదుకు వెళతామని చెప్పలేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

చంద్రబాబు స్వార్ధం కోసమే రాజధాని అమరావతి
విభజన సమయంలో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, 2024లో గా రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో శివరామకృష్ణ కమిటీ ని వేసి కొన్ని సూచనలు చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. కానీ చంద్రబాబు వాటిని పట్టించుకోకుండా స్వలాభం కోసం, తన స్వార్ధ ప్రయోజనాల కోసం రాజధానిగా అమరావతి నే ప్రకటించారని, దోపిడీ కోసం రాజధాని అమరావతి చట్టం కూడా చేశారని ఆరోపించారు. కానీ ఆ చట్టాన్ని పార్లమెంటుకు పంపకుండా చంద్రబాబు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు.
Recommended Video

టీడీపీ నేతల వ్యంగ్య భాషల వల్లే టీడీపీ హయాంలో రాష్ట్రం పదేళ్ళు వెనక్కు పోయింది
రాజధాని అమరావతి చట్టాన్ని అప్పుడే కేంద్రానికి పంపి, ఆమోదింపజేసుకోవాల్సి ఉన్నా చంద్రబాబు ఆ పని చేయలేదన్నారు. ఇక ఇదే విషయాన్ని చెబితే అచ్చెన్నాయుడు వ్యంగ్యంగా స్పందిస్తారు అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ వ్యంగ్య భాషల వల్లే రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారు అంటూ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శాసన రాజధానిగా అమరావతి అభివృద్ధి జరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications