పట్టిసీమ ఒట్టిసీమ కాదు బంగారుసీమ: నీళ్ళు విడుదలచేసి జగన్‌కు మంత్రి నిమ్మల కౌంటర్
దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం చంద్రబాబుదేనని ఆయన అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణ డెల్టాకు సాగు, తాగునీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు గత ప్రభుత్వ వైఖరి పైన గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలపైన విమర్శలు గుప్పించారు.
జగన్ కు మంత్రి నిమ్మల కౌంటర్
గతంలో పట్టిసీమను జగన్ వట్టిసీమ అన్నారని, ఇప్పుడు అదే బంగారం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కృష్ణా డెల్టాకు తాగునీరు, సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమే అని ఆయన వెల్లడించారు. జగన్ హయాంలో తాగునీటి వ్యవస్థను విధ్వంసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృధా నీటిని అరికట్టవచ్చని, జగన్ హయాంలో అది కూడా జరగలేదని ఆయన తెలిపారు.

చంద్రబాబుపై మంత్రి నిమ్మల వ్యాఖ్యలు
ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రకు బదిలీ చేయించడం చంద్రబాబు ముందుచూపుకు నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీరు వినియోగం అవుతోందని పేర్కొన్న నిమ్మల పట్టిసీమ నీటిని విడుదల చేయకపోతే లక్షలాదిమంది దాహార్తి ఎలా తీరుస్తారంటూ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఒక్క చుక్క నీటిని కూడా వృధా చేయొద్దని చెప్పారని, ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సాగునీటి అవసరాలు తీరుస్తామన్న మంత్రి నిమ్మల
ప్రస్తుతం పోలవరం కుడి కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని, అనంతరం కృష్ణా డెల్టాకు అవసరానికి అనుగుణంగా 8,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని, అదేవిధంగా ఈ నీటి విడుదల వల్ల కృష్ణా డెల్టా నందు 13.08 లక్షలు ఎకరాలకు ఈ నీరు సరఫరా చేయబడుతుందన్నారు. ఈ నీటి విడుదల ద్వారా రైతులు పంటల సాగుకు ఉపయోగపడుతుందని అదేవిధంగా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని మంత్రి అన్నారు.
ఒకేరోజు నాలుగు పథకాల ద్వారా నీటిని విడుదల చేయడం ఒక చరిత్ర
తాడిపూడి నుంచి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, ఏలేరు రిజర్వాయర్ లో నీరు ఉంటే స్టీల్ ప్లాంట్ విశాఖకు తాగునీరు అందుతుందని, ఏలూరులో నీటి నిల్వకు ప్రయత్నం చేస్తున్నామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఒకేరోజు నాలుగు పథకాల ద్వారా నీటిని విడుదల చేయడం ఒక చరిత్ర అని పేర్కొన్న ఆయన రాష్ట్రంలో నీటి నిర్వహణకు అధికారుల సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తున్నామన్నారు.
#నేడు పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేసిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) July 3, 2024
నేడు ఒకే రోజు నాలుగు ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనతేనని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన తొలిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి… pic.twitter.com/iwVWZ7zOs7
పట్టిసీమలో మంత్రి నిమ్మల నీరు విడుదలపై రైతుల హర్షం
నేడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం లోని 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. పట్టిసీమలో యంత్రాలు, మోటర్లకు పూజలు నిర్వహించిన మంత్రి నిమ్మల పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. పట్టి సీమ నీటిని విడుదల చెయ్యటం పట్ల కృష్ణా డెల్టా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది.












Click it and Unblock the Notifications