పవన్ కళ్యాణ్ సస్పెన్స్ క్రియేట్ చేసి సభను తుస్సుమనిపించారు: ఎమ్మెల్యే గ్రంధి సెటైర్లు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలలో నిర్వహించిన వారాహి యాత్రపై, భీమవరం లో నిర్వహించిన బహిరంగ సభ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోమారు హాట్ కామెంట్స్ చేశారు. భీమవరం సభ గురించి పవన్ కళ్యాణ్ సస్పెన్స్ క్రియేట్ చేశారని కానీ పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని తుస్సు మనిపించాడు అని గ్రంధి శ్రీనివాస్ సెటైర్లు వేశారు.
జనసేన పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ అని ప్యాకేజీ పార్టీ అని విమర్శించారు. యువకులు, రైతులు, శ్రామికులు రాష్ట్రంలో మోసపోతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అబద్ధాలు మాట్లాడాడని గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. మహనీయుల పేర్లు చెబుతూ పవన్ కళ్యాణ్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తనను తాను ఎందుకు మోసం చేసుకుంటున్నాడో చెప్పాలని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది చంద్రబాబును సీఎం చేయడానికి అన్న గ్రంధి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోరాటంలో త్యాగం చేసిన భగత్ సింగ్ పేరు చెబుతూ, ఒంటరిగా వెళ్ళి ఆత్మార్పణ చేయాల్సిన పని లేదని చెప్పడం పవన్ కళ్యాణ్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం అన్నారు.
2019లో విడివిడిగా పోటీ చేస్తున్నామని ప్రజలకు చెవిలో పువ్వులు పెట్టారన్నారు. నాకు మీరెవరు ఓట్లు వేయలేదు అంటూ సొంత పార్టీ నేతలను కూడా అవమానిస్తున్నారని గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు . చంద్రబాబులో పవన్ కళ్యాణ్ కు భగత్ సింగ్, పొట్టి శ్రీరాములు, చేగువేరా కనిపిస్తున్నారేమో చెప్పాలని గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నించారు.
భీమవరం డంపింగ్ యార్డు గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ అంతకుముందు పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వారిని ప్రశ్నించలేదని మండిపడ్డారు. చంద్రబాబు మద్య నిషేధాన్ని ఎత్తేశారు కాబట్టి ఆయనకు సపోర్టుగా మద్య నిషేధం సాధ్యం కాదంటున్నారు అని పవన్ కళ్యాణ్ ను ఎద్దేవా చేశారు.
ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు హింసిస్తే అన్ని వర్గాలు బాధ పడ్డాయని చంద్రబాబు హయాంలో చేసిన దాష్టీకాలను భరించలేకే ప్రజలు మిమ్మల్ని ఓడించారని గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావిస్తారని ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భావించే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. మళ్లీ వచ్చే ఎన్నికలలో ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications