రానున్న బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ మూడు రాజధానుల బిల్లులు: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి లెక్క ఇది!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జగన్ నిర్ణయం అయిన మూడు రాజధానులు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు, అలాగే మార్పులు చేర్పులతో సమగ్రంగా మరోమారు వికేంద్రీకరణ బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో ఏపీలో రాజధాని వ్యవహారంపై చర్చ జరుగుతోంది. మూడు రాజధానులు బిల్లును రద్దు చేసిన జగన్ మళ్లీ బిల్లును తీసుకు వస్తారా? అది ఇప్పట్లో జరుగుతుందా? మార్పులు చేర్పులతో జగన్ తీసుకువచ్చే బిల్లులలో మూడు రాజధానుల ఏర్పాటు ఉంటుందా? లేక ఏకైక రాజధానిని జగన్ బిల్లులో చేరుస్తారా? వంటి అనేక రకాల చర్చలు ఏపీలో జరుగుతున్నాయి.

మూడు రాజధానుల ఏర్పాటు జరిగి తీరుతుంది; వైసీపీ మంత్రుల క్లారిటీ
ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీ మంత్రులు మూడు రాజధానులు నిర్ణయానికి జగన్ సర్కార్ కట్టుబడి ఉందని, మూడు రాజధానులు ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, మూడు రాజధానుల ఏర్పాటును ఆపేది లేదని, మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని క్లారిటీ ఇస్తున్నారు. నిన్నటికి నిన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది ఇంటర్వెల్ మాత్రమే సినిమా ఇంకా అయిపోలేదు అంటూ, శుభం కార్డు పడడానికి సమయం ఇంకా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రాజధానులు నిర్ణయం పై వెనక్కి తగ్గేది లేదని, మడమ తిప్పేది లేదని తేల్చి చెప్పారు.

మూడు రాజధానుల ఏర్పాటుపై స్పందించిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
తాజాగా మరోమారు మూడు రాజధానుల వ్యవహారంపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. సీఎం జగన్ చెప్పారంటే చేస్తారంతే అంటూ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. జగన్ తగ్గేదే లేదని ఆమె తేల్చి చెప్పారు. ప్రస్తుతమున్న వికేంద్రీకరణ బిల్లులో మరికొన్ని విషయాలను జత చేర్చి వచ్చే నెలలో లేదా రానున్న బడ్జెట్ సమావేశాల్లో, మళ్లీ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. పాదయాత్రకు భయపడితే పాదయాత్ర ప్రారంభం కాక ముందే నిర్ణయం తీసుకునే వాళ్ళని, కోర్టులో రాజధాని కేసులు విచారణ జరుగుతోందని తీర్పు రాబోతుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

డిసెంబర్ లో లేదా రానున్న బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ మూడు రాజధానుల బిల్లు
చట్టంలో కొన్ని క్లాజులు మిస్ అయ్యాయని దానికి సవరణలు చేసి మళ్లీ పెడతామని ఉండవల్లి శ్రీదేవి తేల్చి చెప్పారు. సర్వేజనా సుఖినోభవంతు అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయమని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నారు. వచ్చే డిసెంబరు లేదా రానున్న బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులు పై మళ్లీ కొత్త బిల్లు తప్పక తీసుకొస్తామని అమరావతి ప్రాంత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు.ఇక ఇదే సమయంలో అమరావతి రైతుల ఆందోళన పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు ఎవరు ఆందోళనలు చేయడంలేదని పేర్కొన్న ఉండవల్లి శ్రీదేవి వాళ్లంతా టిడిపి బినామీలంటూ, టీడీపీ బినామీలే రోడ్ల మీదకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video

పోరాటం చేస్తుంది రైతన్నలు కాదు, టీడీపీ బినామీలు .. శ్రీదేవి ఆగ్రహం
రాజధాని రైతన్నల అపోహలను తొలగించడం కోసం వారితో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని మరోమారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకు వెళ్తానని తాను చెప్పానని వచ్చేందుకు వాళ్ళెవరూ సిద్ధంగా లేరని పేర్కొన్నారు. రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న వారు రైతులు కాదని, అందుకే వారు సీఎం వద్దకు రావడానికి ఆసక్తి చూపించటం లేదని ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు . పాదయాత్ర ప్రారంభించినప్పుడు వైసీపీ నేతలను ఎవరైనా పిలిచారా ఐక్య కార్యాచరణ సమితికి వైసిపి అవసరం లేదా అని ప్రశ్నించారు ఉండవల్లి శ్రీదేవి. ఇక మూడు రాజధానులు తప్పనిసరిగా ఉంటాయని, ఇందులో తిరుగే లేదని, ప్రజలెవరూ గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు ఉండవల్లి శ్రీదేవి.












Click it and Unblock the Notifications