పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం
సమాజంలో రోజు రోజుకి విపరీత ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను సైతం కాటికి పంపిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నిన్నటికి నిన్న ఒక తండ్రి రెండేళ్ళ చిన్నారికి సపోటా పండులో ఎలుకల మందు కలిపి తినిపించి ప్రాణం తీస్తే, ఇక తాజాగా ఓ తల్లి రోజుల బిడ్డ ఉసురు నిష్కారణంగా తీసింది.
మాతృత్వానికే మచ్చ తెచ్చిన దారుణ ఘటన
రెండేళ్ళ పసి బిడ్డ ప్రాణం తీసిన తండ్రి, పసి బిడ్డ ప్రాణం తీసిన తల్లి ఇద్దరూ కుటుంబ కలహాలతో ఉండటం ప్రధానంగా కనిపిస్తుంది. తాజాగా రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలలోకి వెళితే.. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఎన్ ఆర్ అగ్రహారంలో మాతృత్వానికే మచ్చ తెచ్చిన దారుణ ఘటన వెలుగు చూసింది.

పసి బిడ్డ ప్రాణం తీసిన తల్లి
హేమావతి అనే ఒక మహిళ తనకు కొద్దిరోజుల క్రితం పుట్టిన పసిబిడ్డను అత్యంత దారుణంగా చంపేసింది. కడుపున పుట్టిన బిడ్డ మీద ఉండే మమకారం కూడా లేకుండా కసాయిగా మారి చిన్నారి ప్రాణం తీసింది. అసలు కన్నతల్లి బిడ్డ ప్రాణం తీయడానికి గల కారణం తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.
పాలకోసం బిడ్డ ఏడుస్తుందని కోపంతో బిడ్డను చంపేసిన తల్లి
బిడ్డ తరచుగా పాల కోసం ఏడుస్తూ ఉండడంతో, ఆ ఏడుపు నచ్చక తల్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించినట్టు సమాచారం. ముక్కుపచ్చలారని లోకం తెలియని పసి బిడ్డను అమానుషంగా హతమార్చడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు హేమావతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
భర్తతో భార్యకు గొడవలు
గత కొంతకాలంగా భర్తతో గొడవలు పడుతున్న సదరు మహిళ బిడ్డను హతమార్చడం వెనుక బిడ్డ ఏడుపు కారణమా లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఏది ఏమైనా సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా జరుగుతున్న ఘటనలు మాతృత్వానికి మాయని మచ్చగా మారుతున్నాయి. మారుతున్న మానవ సంబంధాలు ప్రతీ ఒక్కరికీ ఆందోళన కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications