సీఎం చంద్రబాబు ఫ్యామిలీలో హిట్లర్ ఎవరంటే... నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీ మంత్రి నారా లోకేష్ గురించి ఆయన తల్లి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆసక్తికర విషయాలు చెప్పారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన ఆమెను విద్యార్థులు పలు విషయాలను అడిగారు. దీంతో భువనేశ్వరి విద్యార్థులకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. నారా లోకేష్ ను తాను చాలా పద్ధతిగా పెంచానని, అందుకే తనను హిట్లర్ అని పిలిచేవాడనీ లోకేష్ తల్లి భువనేశ్వరి తెలిపారు.
ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన నారా భువనేశ్వరి
సీఎం చంద్రబాబు నాయుడు తనకు అస్సలు టైం ఇవ్వరని, ఆయన ఎప్పుడు బిజీగా ఉండడం వల్ల తాను కూడా ఎప్పుడూ ఆయనను డిస్టర్బ్ చేయనని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ తన తమ్ముడు అని అందరూ అనుకుంటారని కానీ ఆయన తనకు అన్న అని నారా భువనేశ్వరి వెల్లడించారు.

కుప్పం ను ఐదేళ్ళలో అభివృద్ధి చేస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారని, ప్రజల గురించే పరితపిస్తారని, ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబును సొంత బిడ్డగా భావిస్తూ ఆయనపై ప్రేమాభిమానాలు చూపించే కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేమని వెల్లడించారు. రాబోయే ఐదు సంవత్సరాలలో కుప్పంను అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తీర్చిదుద్దుతామని మాటిస్తున్నానని భువనేశ్వరి పేర్కొన్నారు.

తనకు చంద్రబాబే స్ఫూర్తి అన్న భువనేశ్వరి
దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని కష్టపడితే విజయం సొంతమవుతుందని భువనేశ్వరి తెలిపారు. మంచి విజన్ తో ముందుకు వెళితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ప్రతిరోజు ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు తనకు స్ఫూర్తి అని భువనేశ్వరి విద్యార్థులకు తెలిపారు . పట్టుదల, సంకల్పంతో పని చేస్తే ఖచ్చితంగా విజయం సొంతమవుతుందని, ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అన్నారు భువనేశ్వరి.
కష్టపడి బాగా ఎదగాలని విద్యార్థులకు సూచన
తనకు 19 సంవత్సరాలకి పెళ్లి చేశారని, అప్పటికి తనకు ఏమీ తెలియదని తన భర్త చంద్రబాబు తనపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారన్నారు. దానిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని పనిచేశానని భువనేశ్వరి పేర్కొన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యే వారని, కానీ ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. మగవారితో సమానంగా ప్రతిభ కనబరుస్తున్నారని భువనేశ్వరి విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు కష్టపడి బాగా ఎదగాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications