బాలయ్యకు ఆమె అంటే చాలా భయం - సీక్రెట్ రివీల్ చేసిన మంత్రి లోకేష్..!!

నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒకరికి మాత్రమే భయపడతారని అది తన కూతురు బ్రాహ్మణి అని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సీక్రెట్ రివీల్ చేశారు. ఓ ఛానెల్ నిర్వహిస్తున్న రియాలిటీ టాక్ షోలో లోకేష్ పాల్గొన్నారు. ఈ షోకు హోస్ట్‌గా నటుడు జగపతిబాబు వ్యవహరిస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో లోకేష్ పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన జీవితంలో అనేక అంశాలను ఈ సందర్భంగా లోకేష్ షేర్ చేసుకున్నారు.

స్కూల్లో లోకేష్ అల్లరి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రతిష్టాత్మక భారతీయ విద్యా భవన్‌ స్కూల్లో చదివిన లోకేష్... చాలా అల్లరి చేసేవాడట.ఈ విషయాన్ని తన స్నేహితులతో పాటు తనకు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లు కూడా స్పష్టం చేశారు. అయితే ఆ అల్లరి లోకేష్ ఈ రోజు ఓ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం తమకెంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. లోకేష్‌ ఇలానే ఇంకా పైకెదగాలని రాష్ట్ర పగ్గాలు చేపట్టాలని ఆ స్కూలు ప్రిన్సిపల్‌గా పనిచేసిన రమాదేవితో పాటు లోకేష్ తెలుగు టీచర్ మంజుల ఆశీర్వదించారు.స్కూల్‌లో టీచర్లు కొట్టిన దెబ్బలు ఇంకా తనకు గుర్తున్నాయని నెమరేసుకున్న మంత్రి.. ఆ రోజు వారు అలా దెబ్బలు కొట్టి క్రమశిక్షణ నేర్పించడం వల్లే ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పుకొచ్చారు.

nara-lokesh-opens-up-about-his-family-political-journey-and-life-in-us-on-jagapathi-babu-talk-show

తాను స్కూల్లో బ్యాక్ బెంచ్ అని చెప్పుకొచ్చిన మంత్రి లోకేష్... తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. సమయం దొరికితే చాలు గ్రౌండ్‌లో వాలిపోయేవాడినంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తన స్నేహితులు ఇప్పటికీ తనతో టచ్‌లో ఉంటారని, ఇప్పటికీ తనకు సలహాలు, సూచనలు పలు విధానాలపై ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటారని లోకేష్ చెప్పారు. అదే సమయంలో వారికొక వాట్సాప్ గ్రూప్ ఉందని అందులో సరదాగా చాటింగ్ చేసుకుంటూ ఉంటామని అన్నారు. తన స్నేహితులు వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నారని దీంతో ఏదైనా చేయాలనుకుంటే వారి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుంటారని వివరించారు.

అమెరికా జీవితం తనకు ఎన్నో పాఠాలను నేర్పిందన్నారు లోకేష్. పై చదువుల కోసం తొలిసారిగా అమెరికా వెళ్లినప్పుడు తొలి సెమిస్టర్‌లో చాలా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చారు.ఆ తర్వాత సొంతంగా ఎలా నిలబడాలో అమెరికా నేర్పించిందని గుర్తుచేసుకున్నాడు. ప్రతీది సవాలుగా తీసుకోవడం అక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పారు.తనది బట్టీ కొట్టే బ్యాచ్ కాదని చెప్పిన లోకేష్..ఒక సబ్జెక్ట్‌‌ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారని వెల్లడించారు. అందుకనే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో తాను పెద్దగా రాణించలేకపోయినట్లు వివరించారు. అమెరికాలో చదువులు చాలా సిస్టమాటిక్‌గాను కష్టంగాను ఉంటాయని..ఎక్కువగా క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ విధానం ఉంటుందని చెప్పారు. ఇక ఆయా దేశాల్లో ఎలాంటి పని వాతావరణం ఉంటుందో తెలుసుకునేందుకు తాను అమెరికాలో జీఈ కంపెనీలో పనిచెసినట్లు చెప్పారు.జర్మనీలో కూడా పనిచేసినట్లు వెల్లడించిన లోకేష్.. సింగపూర్‌లోని ప్రధాని కార్యాలయంలో కూడా పనిచేసిన అనుభవం తనకుందన్నారు.

పులివెందులోనే ఎందుకిలా ? మీ ఏకగ్రీవాల సంగతేంటి? జగన్ కు లోకేష్ కౌంటర్..!
పులివెందులోనే ఎందుకిలా ? మీ ఏకగ్రీవాల సంగతేంటి? జగన్ కు లోకేష్ కౌంటర్..!

భార్య బ్రాహ్మణి గురించి...

ఇక లోకేష్ తన భార్య బ్రాహ్మణి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. లోకేష్ స్టాన్‌ఫోర్డ్‌లో విద్యనభ్యసించిన ఐదేళ్లకు బ్రాహ్మణి కూడా స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో సీటు సంపాదించిందని చెప్పారు. ఇది యాధృచికంగా జరిగిందని అన్నారు. బ్రాహ్మణి చిన్నప్పటి నుంచే చదువుల్లో టాపర్ అని చెప్పిన మంత్రి...తను ఎంబీఏ చేసేందుకు ఐదు బెస్ట్ యూనివర్శిటీలకు అప్లయ్ చేయగా ఐదు యూనివర్శిటీల్లో సీటు వచ్చిందన్నారు. అయితే చివరిగా స్టాన్‌ఫోర్డ్‌ను ఎంపిక చేసుకుందని వివరించారు.ఇంట్లో చంద్రబాబు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతను అప్పగించారని వెల్లడించారు. ఇందులో భాగంగా బ్రాహ్మణి హెరిటేజ్ వ్యాపారాన్ని చూసుకుంటుండగా.. తల్లి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటోందని చెప్పారు.

హెరిటే‌జ్ గురించి...

హెరిటేజ్‌ను స్థాపించిన తర్వాత చంద్రబాబు అమెరికాను వదిలి సొంత బిజినెస్ చూసుకునేందుకు వచ్చేయాలని చెప్పడంతో అమెరికాను వీడి హెరిటేజ్‌లో బాధ్యతలు చేపట్టినట్లు లోకేష్ చెప్పారు. అయితే తాను బాధ్యత చేపట్టిన తొలి ఏడాదిలో సంస్థకు రూ.6కోట్లు నష్టం వచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత కంపెనీని లాభాల్లో నడిపించేందుకు ఎన్నో పరిశోధనలు చేసినట్లు తెలిపిన మంత్రి... తొలిసారిగా పెరుగును శాషెట్స్‌లో తీసుకురావాలన్న ఆలోచన తనకు వచ్చిందని చెప్పారు. దీనికోసం చాలా రీసెర్చ్ చేసినట్లు వెల్లడించారు. ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయ్యిందని ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోబడలేదని గుర్తుచేసుకున్నారు.

కుటుంబం గురించి...
లోకేష్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు తండ్రి చంద్రబాబు తనకు చాలా తక్కువ సమయం కేటాయించేవారని గుర్తుచేసుకున్న లోకేష్... ఆ పరిస్థితి తన కొడుకు దేవాన్ష్‌కు రాకూడదని తాను డిసైడ్ చేసుకున్నట్లు చెప్పారు. అందుకే ఆదివారం అందరిలానే తాను తన భార్యా కొడుకుతో సమయం గడుపుతానని చెప్పారు. ప్రతి ఒక్కరు కుటుంబానికి సమయం కేటాయించాలని ఈ సందర్భంగా లోకేష్ పిలుపునిచ్చారు. తనకు అతిపెద్ద బలం తన కుటుంబమే అని వెల్లడించారు. దేవాన్ష్‌కు సంబంధించి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌కు కచ్చితంగా హాజరవుతానని వివరించారు. దేవాన్ష్ పుస్తకాల పురుగని..ఏ పుస్తకం ఇచ్చిన ఇట్టే చదివేస్తాడని చెప్పారు. గంటల తరబడి పుస్తకాలు చదవడం తన తల్లి బ్రాహ్మణి నుంచి దేవాన్ష్ అలవర్చుకున్నారని వెల్లడించారు.ఇక అందరికీ బాలయ్య తనకు మాత్రం ముద్దుల మావయ్య అని చెప్పే లోకేష్... బాలకృష్ణకు బ్రాహ్మణి అంటే చాలా భయమని చెప్పారు. లంచ్‌కు మాత్రం బ్రాహ్మణిని ఇంటికి తీసుకురావొద్దని పదేపదే చెప్పేవాడని చెబుతూ సెట్‌లో సరదాగా నవ్వులు పూయించాడు. బ్రాహ్మణి వస్తే తాను ఆదివారం తినాలనుకున్న వాటిని తినకుండా నియంత్రిస్తుందని బాలయ్య చెప్తారని లోకేష్ వెల్లడించారు.

పొలిటికల్ ఎంట్రీ పై..

తాత ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా చేశారు, తండ్రి చంద్రబాబు మూడు సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారని ఇక తన రాజకీయ భవిష్యత్తుపై పెద్దగా చర్చ జరిగిన విషయాన్ని మంత్రి లోకేష్ గుర్తుచేసుకున్నారు. 2014 నుంచి 2019 వరకు పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసినట్లు చెప్పిన లోకేష్ తొలిసారిగా 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసినట్లు తెలిపారు. మంగళగిరి నుంచే ఎందుకు పోటీచేయాల్సి వచ్చిందో దాని వెనుక కారణం వివరించారు లోకేష్.చంద్రబాబు కుప్పం నుంచి తనను పోటీచేయమన్నారని అయితే కుప్పం సీటు చంద్రబాబుదే కాబట్టి తాను అక్కడి నుంచి పోటీచేయలేనని చెప్పినట్లు వివరించారు. ఆ సమయంలో 1985లో చివరిసారిగా మంగళగిరి స్థానం టీడీపీ కైవసం చేసుకుందని అలాంటి స్థానం నుంచే పోటీచేస్తానని చెప్పి మంగళగిరిలో పోటీ చేయడం, 5వేల పై చిలుకు ఓట్లతో ఓటమిపాలవడం జరిగిందని గుర్తుచేసుకున్నారు. అయినా సరే 2019 నుంచి 2024 వరకు మంగళగిరిలోనే ఎక్కువ సమయం కేటాయిస్తూ అక్కడి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించి ఆ నియోజక ప్రజల ఆశీస్సులతో 2024లో భారీ మెజార్టీతో గెలిచినట్లు తెలిపారు.

2023 సెప్టెంబర్ చంద్రబాబు అరెస్టు..
2023 సెప్టెంబర్ నెలలో చంద్రబాబు అరెస్టు తనను ఎంతో కలచివేసిందని లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. అరెస్టు సమయంలో తాను యువగళం పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పిన లోకేష్.. అరెస్టుకు రెండ్రోజుల ముందే చంద్రబాబు అరెస్టు అవుతారనే సంకేతాలు వచ్చాయని..అయితే దాన్ని తాను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని అన్నారు. ఎందుకంటే ఏ తప్పు చేయని చంద్రబాబును ఎలా అరెస్టు చేసి జైలుకు పంపుతారు..? న్యాయస్థానంలోనే న్యాయం జరుగుతుందని తాను అనుకున్నట్లు చెప్పారు. అయితే న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించాలని చెప్పడంతో షాక్‌కు గురైనట్లు లోకేష్ చెప్పారు. అందునా రాజమండ్రి జైలు అంటే ఒక కొడుకుగా చాలా భయపడినట్లు లోకేష్ చెప్పారు. చంద్రబాబు హయాంలో డ్రగ్ పెడ్లర్స్, గంధపు చెక్కల స్మగ్లర్లు, క్రిమినల్స్ చాలామంది అరెస్టయి అదే జైలులో ఉన్నారని.. అక్కడికి చంద్రబాబును తరలిస్తే ఆయనకు ఆ క్రిమినల్స్ నుంచి ఏదైన ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుందని చాలా భయపడ్డట్టు చెప్పారు. అంతేకాదు రాజమండ్రి సెంట్రల్ జైలు శిలాఫలకం పై అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు ఉంటుందని..అక్కడే చంద్రబాబు ఉండటం దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు.

చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు, కార్యకర్తలు తనకు అండగా నిలిచారని వారిని ఎప్పుడూ మర్చిపోనని చెప్పారు. తనకు అన్న సమానులైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు గుప్పించారు లోకేష్. కష్ట సమయంలో మనతో ఉన్నవారే నిజమైన స్నేహితులని అలాంటి వారిలో తన కుటుంబంకు అండగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు మరోసారి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబును జైలులో కలిసి వచ్చాక వెంటనే పవన్ కళ్యాణ్ కలిసే పోటీచేస్తామని చెప్పడం ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి చరిత్ర సృష్టించడం అన్నీ జరిగిపోయాయని చెప్పారు.

శ్రీశైలం, అహోబిలానికి బెస్ట్ అవార్డులు! ఏపీ ఆధ్యాత్మిక వైభవానికి జేజేలు
శ్రీశైలం, అహోబిలానికి బెస్ట్ అవార్డులు! ఏపీ ఆధ్యాత్మిక వైభవానికి జేజేలు

సినిమా సెలబ్రిటీల ప్రశ్నలకు..

ఇక ఈ టాక్ షోలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. రణబాలి షూటింగ్ కడప జిల్లాలోని గండికోటలో జరిగిందని అదొక అద్భుతమైన ప్రదేశమని విజయ్ దేవరకొండ చెప్పారు. ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ టూరిజం స్పాట్‌లా తీర్చిదిద్దాలని కోరారు. అదే సమయంలో విశాఖపట్నం కూడా మరింతగా అభివృద్ధి చేస్తే తాము కూడా అక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. దీంతో లోకేష్ తప్పకుండా చేస్తామని చెబుతూనే.. సినిమా సెలబ్రిటీల సహకారంతో చాలా మార్పు తీసుకురావొచ్చని చెప్పారు. ఇక మరో సెలబ్రిటీ డైరెక్టర్ సందీప్ వంగా.. తెలుగు ఇండస్ట్రీకి హైదరాబాద్ తర్వాత విశాఖను రెండవ బేస్‌గా ఏర్పాటు చేయాలని అడగగా ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో మహిళల ప్రైవసీని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మరో హీరోయిన్ కోరగా.. అదే తమ తొలి లక్ష్యం అని లోకేష్ చెప్పుకొచ్చారు. ఏఏఐతో మహిళల వ్యక్తిగత జీవితాలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+