
నెల్లూరు ఆస్పత్రిలో సెక్యూరిటీగార్డుల వైద్యం ఘటన: లోకేష్ ఫైర్; మంత్రి విడదల రజిని ఏంచేశారంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో వరుస ఘటనలు వైద్య ఆరోగ్యశాఖ పనితీరుకు అద్దం పడుతున్నాయి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం ఘటన, ఆపై రుయా ఆస్పత్రిలో బాలుడి మృతదేహాన్ని బైక్ పై తరలించిన ఘటన తర్వాత చోటు చేసుకున్న వరుస ఘటనలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి ఇబ్బందికరంగా మారాయి. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటన ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

లెక్చరర్ రామకృష్ణ కు సెక్యూరిటీ గార్డులు వైద్యం చేసిన ఘటన
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణ అనే అధ్యాపకుడిని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే అతనికి సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లే చికిత్స చేశారు. వైద్యులు ఎవరు లేకుండా సెక్యూరిటీ గార్డులు రామకృష్ణ తలకు కట్టుకట్టి, సెలైన్ పెట్టారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ కేవలం ఇంజెక్షన్ మాత్రమే ఇచ్చి పేషెంట్ పరిస్థితిని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఇక ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందడం లేదని భావించిన కుటుంబ సభ్యులు రామకృష్ణ ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు.
సమయానికి సరైన వైద్యం అందక రామకృష్ణ మృతి
రామకృష్ణను తరలిస్తున్న సమయంలో రామకృష్ణ తలకు కట్టిన కట్టు ఊడిపోయింది. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామకృష్ణ మరణించారు. రామకృష్ణ మృతిపై కుటుంబీకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యం సరిగాలేదని, వైద్యులు సరిగా స్పందించక పోవడం వల్లే రామకృష్ణ మృతి చెందాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ ఆస్పత్రుల పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు.

రామకృష్ణ మృతి ఘటన; ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడమే శాపమా? అని ఫైర్ అయిన లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయింది. బైక్ యాక్సిడెంట్లో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడమే శాపమా? డ్యూటీ డాక్టర్ వుండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేసి ప్రాణంతో చెలగాటమాడటం దారుణం అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి ప్రచారమేమో ప్రజారోగ్య దేవుడు..వాస్తవమేమో ప్రజల పాలిట యముడు అంటూ మండిపడ్డారు. కక్షసాధింపుల్లో జగన్ ప్రభుత్వం ఉంటే, వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనం ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. రోజురోజుకీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు దిగజారుతున్నా వైసిపి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని ధ్వజమెత్తారు.

విచారణ కమిటీ వేసి,దర్యాప్తుకు మంత్రి విడదల రజిని ఆదేశం
ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై మంత్రి విడదల రజిని స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీ వీవీవీ కమిషనర్ కు మంత్రి విడదల రజిని పలు ఆదేశాలు జారీ చేశారు. అధ్యాపకుడు రామకృష్ణకు అందిన వైద్యం పై సమగ్రంగా విచారణ చేపట్టాలని, కమిటీని నియమించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన అధ్యాపకుడు రామకృష్ణ మృతి చెందడం బాధాకరమని పేర్కొన్న మంత్రి విడదల రజిని కమిటీ నివేదికలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ పునరావృతం కాకూడదని విడదల రజిని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తప్పవని విడదల రజిని హెచ్చరించారు.