ఏపీలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు-జనవరి 1 నుంచే అమలుకు రెడీ..!
ఏపీలో ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సవరించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో అడ్డగోలుగా మార్చేసిన రిజిస్ట్రేషన్ విలువలను వాస్తవ పరిస్ధితుల ఆధారంగా సవరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఇప్పటికే రిజిస్ట్రేషన్ల విలువలపై కసరత్తు ప్రారంభించింది. ఈ కసరత్తు నెలాఖరు కల్లా పూర్తి చేసి జనవరి 1 నుంచి కొత్త విలువలను అమల్లోకి తీసుకురానుంది.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువలు ప్రస్తుతం అశాస్త్రీయంగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తమకు నచ్చిన ప్రాంతాల్లో వైసీపీ నేతలు రిజిస్ట్రేషన్ల విలువను వాస్తవ పరిస్ధితులకు భిన్నంగా పెంచేసినట్లు భావిస్తోంది. దీంతో అలా జరిగిన చోట తిరిగి వాస్తప పరిస్ధితుల ఆధారంగా పెంచడం లేదా తగ్గించడం చేయాలని నిర్ణయించిది. ఇందుకోసం జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా మార్పులు చేస్తారు.

ఇలా జిల్లా కమిటీలు ఆమోదించిన ప్రతిపాదనలు ఈ నెల 20 కల్లా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో పెడతారు. 24 వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరించి 27న వాటిని పరిశీలిస్తారు. అనంతరం నెలాఖరు కల్లా వీటిని ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. ప్రభుత్వం వీటిని ఆమోదించి జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువల్ని అందుబాటులోకి తెస్తుంది. తాజా సమాచారం మేరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశముంది.












Click it and Unblock the Notifications