రాయలసీమ లిఫ్ట్ పై జగన్ సర్కార్ కు కేంద్రం మద్దతు-ఎన్టీటీ అనుమానాలు-చర్యలు తప్పవా ?
ఏపీలోని రాయలసీమ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలకు కీలకంగా భావిస్తున్న రాయలసీమ లిఫ్ట్ వ్యవహారం మరోసారి జాతీయ హరిత ట్రైబ్యునల్ విచారణకు వచ్చింది. తాజాగా కృష్ణాబోర్డుతో పాటు కేంద్ర పర్యావరణ శాఖ బృందాలు పర్యటించిన నేపథ్యంలో రాయలసీమ లిఫ్ట్ పై ఇవాళ ఎన్టీటీలో విచారణ జరిగింది. ఈ మేరకు కేంద్రం దాఖలు చేసిన అఫిడివిట్ పై ఎన్టీటీ విచారణ జరిపింది.
కేంద్రం తన అఫిడవిట్ లో రాయలసీమ లిఫ్ట్ వద్ద ఎలాంటి పనులు జరగడం లేదని పేర్కొంది. దీనిపై ఎన్టీటీ ధర్మాసనం అనుమానాలు వ్యక్తం చేసింది. అక్కడ కేవలం డీపీఆర్ కోసమే యంత్రాలు తెచ్చిపెట్టామని, సర్వే మాత్రమే జరిగిందంటూ గతంలో ఏపీ ప్రభుత్వం కూడా పేర్కొంది. కానీ ఈ వాదనతో ఎన్టీటీ చెన్నై ధర్మాసనం సంతృప్తి చెందలేదు. దీంతో ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా ముందుగా తమకు తెలియజేయాలని ఏపీ ప్రభుత్వం ఎన్టీటీని కోరింది. ఈ మేరకు వాదనలు వినిపించేందుకు తమకు సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఎన్టీటీని కోరింది.

మరోవైపు రాయలసీమ లిఫ్ట్ కోసం ఎలాంటి పనులు జరగడం లేదని కేంద్ర పర్యావరణశాఖతో పాటు కృష్ణారివర్ బోర్డు కూడా నివేదికలు ఇచ్చినా, తెలంగాణ ప్రభుత్వం అక్కడ జరుగుతున్న పనులపై ఎన్టీటీకి ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. దీంతో వీటిపై ఇప్పుడు ఎన్టీటీ వీచారణ జరుపుతోంది. అయితే కీలకమైన రాయలసీమ లిఫ్ట్ విషయంలో కేంద్రం కూడా వైసీపీ సర్కార్ కే అండగా నిలుస్తోంది. కానీ తెలంగాణ అభ్యంతరాలతో ఈ వ్యవహారం జటిలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, కృష్ణా రివర్ బోర్డు అండగా నిలిచినా ఎన్టీటీ మాత్రం ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా తనకు ఆ అధికారం ఉందా లేదా అనేది తేల్చాల్సి ఉంది. ఆ తర్వాత ఎన్టీటీకి అధికారం లేకపోతే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా చర్యలకు ప్రతిపాదించేందుకు ఎన్టీటీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దీన్ని ఏపీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications