అమరావతి ఓఆర్ఆర్ పై మారిన నిర్ణయం - ఈ ప్రాంతాల మీదుగా, తాజా టెండర్లతో..!!
అమరావతి కేంద్రంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాజధానిలో నిర్మాణాలు వేగం పెరుగుతున్నాయి. 2028 చివరి నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం గా నిర్ణయించింది. అమరావతి ఓఆర్ఆర్ పైనా వేగంగా అడుగులు పడుతున్నాయి. నాలుగు ప్యాకేజీలు ఈ నిర్మాణం పూర్తి చేయాలని తొలుత డిసైడ్ అయినా నిర్ణయం మారింది. అందులో భాగంగా NHAI టెండర్లు ఆహ్వానించింది. ఈ ఓఆర్ఆర్ రూట్ ఖరారైంది. మండలాలు, గ్రామాలు ఫిక్స్ చేసారు. ఈ నిర్మాణం గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నారు.
రాజధాని అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ మరోమారు టెండర్లను ఆహ్వానించింది. గతంలో నాలుగు ప్యాకేజీలుగా ఓఆర్ఆర్ను నిర్మించాలని భావించిన ఎన్హెచ్ఏఐ తాజాగా దాన్ని రెండు ప్యాకేజీలకు కుదించింది. పబ్లిక్ ప్రైవేట్ అప్రైజల్ కమిటీ(పీపీఏసీ) సూచనల మేరకు ప్యాకేజీల్లో మార్పులు జరిగాయి. దీనికి పీపీఏసీ ఆమోదం తెలపడంతో ఓఆర్ఆర్ టెండర్ల ప్రక్రియ తిరిగి మొదలైంది. కాంట్రాక్టర్లు బిడ్లు సమర్పించేందుకు జనవరి 15 వరకూ గడువు ప్రకటించింది. తాజా టెండర్లలో ఓఆర్ఆర్ పొడవు మొత్తం 195.13 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. ఇందులో ప్రధానమైన ఔటర్ రింగురోడ్డు 189.93 కి.మీ.లు కాగా, గుంటూరును ఓఆర్ఆర్తో కలిపేందుకు నారాకోడూరు నుంచి గుంటూరు శివారులో ఉన్న బుడంపాడు వరకూ 5.2కి.మీ. మేర నాలుగు వరసల్లో నిర్మించే కనెక్ట్ రోడ్డు(సర్ప్)తో కలిపి మొత్తం 195.13 కి.మీ.లుగా పేర్కొన్నారు. అయితే, తొలుత పిలిచిన టెండర్లలో దీనిని 27.93 కి.మీ., 56కి.మీ., 55.7కి.మీ., 55.5కి.మీ. చొప్పున నాలుగు ప్యాకేజీలుగా విభజించారు.

తాజా టెండర్లు
తాజా నిర్ణయం మేరకు ఇప్పుడు రెండు ప్యాకేజీలుగా మార్చారు. తొలి ప్యాకేజీ పొడవు 87.63 కి.మీ. అది ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపం నుంచి ఆగిరిపల్లి, ఉయ్యూరు మీదుగా కృష్ణాజిల్లా కంకిపాడు మండలం చలివేంద్రపాలెం వరకూ ఉంటుంది. రెండో ప్యాకేజీ 107.50 కి.మీ. అది ఉయ్యూరు, గుంటూరు మీదుగా కంచికచర్ల వరకూ ఉంటుంది. కృష్ణా నదిపై నిర్మించే రెండు కీలకమైన వంతెనలు ఈ ప్యాకేజీ పరిధిలోకే వచ్చేలా ప్లాన్ చేసారు. ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తి కాగానే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. టోల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 30 వాయిదాలలో చెల్లించేలా టెండర్లు ఆహ్వానించారు.ఈ ఓర్ఆర్ఆర్ పరిధిలోకి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలు వస్తాయి. ఓఆర్ఆర్ నిర్మాణానికి మొత్తం రూ.15,116.45 కోట్లు ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ అంచనా వేసింది. సొంత నిధులతో రోడ్డు నిర్మించి 15 నుంచి 20 ఏళ్ల పాటు టోల్ వసూలు చేసుకునే పద్ధతిలో రోడ్డు నిర్మాణం జరిగేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications
