నో అడ్మిషన్స్ .. ఏపీ, తెలంగాణాలలో ఆస్పత్రుల వద్ద కరోనా బాధితులకు ఎంత కష్టమో!!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది .భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులను సృష్టిస్తోంది.ఇక ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.కరోనా బారిన పడిన రోగులు,కరోనాని ఎదుర్కోవడం కంటే,ఆస్పత్రులలో చేరిక కోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. కేవలం ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సి వస్తోంది. నిజంగా ఆసుపత్రులలో బెడ్ల కొరత ఉందా ? లేదా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారా అన్నది అలా ఉంచితే ఆసుపత్రుల ముందు అడ్మిషన్ల కోసం కరోనా బాధితుల అనుభవిస్తున్న నరక యాతన వర్ణనాతీతంగా మారింది.

ఆస్పత్రుల వద్ద అగచాట్లు పడుతున్న కరోనా బాధితులు,వారి బంధువులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడ ఏ ఆసుపత్రులలో చూసినా వైద్యం కోసం ఆసుపత్రుల బాటపడుతున్న కరోనా బాధితులు పడరాని పాట్లు పడుతున్నారు. బెడ్లు లేవని, ఆక్సిజన్ సపోర్ట్ కావలసినవారు అసలే అడ్మిషన్ అడగవద్దని చెప్పేస్తున్నారు.ఎంత రిక్వెస్ట్ చేసినా ఆసుపత్రులలో బెడ్ లు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. గంటలకొద్దీ కరోనా బాధితుల మధ్య, బాధితుల తరపు బంధువులు వారిని అడ్మిట్ చేయడం కోసం పడుతున్న బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఇదే సమయంలో బాధితుల అవసరాన్ని బట్టి ఆసుపత్రులు నిమిష నిమిషానికి ధరలు పెంచి మరీ బాధితులను వేధింపులకు గురి చేస్తున్నాయి.

ఆస్పత్రులలో బెడ్స్ అంటే అది ఒక ప్రహసనమే ... దోపిడీ పర్వమే
ఆసుపత్రులలో ఒక బెడ్ కావాలంటే దానిని సంపాదించటం కరోనా బాధితులకు ప్రహసనంగా మారుతోంది. కనీసం ఎనిమిది గంటలపాటు ఎఫర్ట్ చేస్తేనే కానీ వారికి ఒక్క బెడ్ దొరకని పరిస్థితి. ఒకరోజు కరోనా పేషెంట్ కు చాలా ఆసుపత్రులు లక్ష రూపాయల వరకు చార్జి చేస్తున్నాయి. ఇక ముందస్తు డిపాజిట్ లక్ష రూపాయలు చెల్లించాల్సిందే .మళ్లీ మందులు, టెస్టులు అదనంగా ఛార్జ్ చేస్తున్నాయి. దారుణ పరిస్థితుల మధ్య, ఆసుపత్రుల విపరీతమైన దోపిడీ మధ్య, కరోనాతో పోరాడుతున్న బాధితులు అల్లాడిపోతున్నారు.

ఆస్పత్రుల వద్ద దారుణ పరిస్థితులకు భయపడి ఇళ్ళ వద్దే చాలా మంది బాధితులు
ఆసుపత్రుల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది కరోనా బాధితులు ఇళ్ల వద్దనే ఉంటూ ఎలాగోలా బయటపడటానికి ప్రయత్నం చేస్తూ, ప్రాణాలను రిస్కులో పెడుతున్నారు. కరోనా సీరియస్ అయ్యే వరకు కూడా ఆసుపత్రుల బాట పట్టడం లేదు. తీరా సీరియస్ అయిన తర్వాత ఆసుపత్రులలో పేషెంట్ ను జాయిన్ చేసుకోని పరిస్థితి నెలకొంది. బాధితులు ఆసుపత్రులలో చేరిక కోసం, ఆసుపత్రుల చుట్టూ తిరగలేక, ఒంట్లో ఓపిక లేక విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు.
Recommended Video

కరోనా బాధితుల ప్రత్యక్ష నరకం.. ప్రభుత్వాల బాధ్యతా లేమికి నిదర్శనం
ఇలాంటి దారుణ పరిస్థితుల మధ్య కరోనా బాధితులు అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకం ప్రభుత్వాల కళ్ళకు కనిపించటం లేదు. అంతా బాగానే ఉంది. అన్ని ఆసుపత్రులలోనూ వైద్యం బాగా అందుతుంది అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం చెప్పనలవి కాకుండా ఉంది. అన్ని ఆసుపత్రులలో ఒకే ధర నిర్ణయించి,ఆసుపత్రులలో బెడ్ ల లభ్యత ఎలా ఉంది అనేవి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేకుంటే కరోనా బాధితులు ఆసుపత్రులలో అడ్మిట్ అవ్వటం ఒక మహా ప్రస్తానంగా మారుతుంది .ఈ ప్రయత్నంలో వారిని అడ్మిట్ చెయ్యాలనుకున్న బాధిత కుటుంబాలు కూడా ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి వారు పేషెంట్లు గా మారే పరిస్థితి కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications