గవర్నర్ ప్రసంగంలో వినిపించని మూడు రాజధానులు-పాలనా వికేంద్రీకరణ చేశామంటూనే..
ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ చేసిన ప్రసంగంలో మూడు రాజధానులపై మాట్లాడకపోయినా వికేంద్రీకరణ ప్రస్తావన వచ్చింది.
అమరావతి : ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఈ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా విచారించి తీర్పు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కోరింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం సంక్షిష్టమైన ఈ కేసులో విచారణను వాయిదాలు వేస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో ఈసారి ఏపీ గవర్నర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చేసిన ప్రసంగంలోనూ మూడు రాజధానుల ప్రస్తావన వినిపించలేదు. ఏపీ కొత్త గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ఇవాళ అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు రాజధానులపై ఆయన మాట్లాడతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగింది. చివరకు గవర్నర్ తన ప్రసంగాన్ని మూడు రాజధానుల ప్రస్తావన లేకుండానే ముగించారు. ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో చేపట్టిన మిగతా అన్ని పనులపై గవర్నర్ ప్రసంగించారు.

మరోవైపు మూడు రాజధానుల ప్రస్తావన లేకపోయినా వికేంద్రీకరణ అంశాన్ని మాత్రం గవర్నర్ ప్రస్తావించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలు,రెవెన్యూ డివిజన్లు పెంచామని గవర్నర్ తెలిపారు. సుప్రీం కోర్టు విచారణలో రాజధాని అంశం ఉన్నందు వల్లన గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే రాజ్యసభలో మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించినప్పుడు కూడా సభాపతి అడ్డుకున్నారు. అయితే గవర్నర్ అబ్దుల్ నజీర్ మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి కావడం, రాజధాని అంశం న్యాయస్ధానం పరిధిలో ఉండటంతోనే దీనిపై మాట్లాడలేదని అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications