Jinnah Tower Guntur: బీజేపీకి షాక్ ఇచ్చేలా అధికారుల ప్లాన్.. గుంటూరులోని జిన్నా టవర్ వివాదానికి ముగింపు?
గుంటూరు నగరంలో స్వాతంత్రానికి పూర్వం నిర్మించిన చారిత్రక జిన్నా టవర్ పేరు మార్చాలంటూ పట్టుబట్టిన బిజెపి, దానిని కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుంటూరు జిన్నా టవర్ పై చెలరేగిన వివాదం నేపథ్యంలో జిన్నా టవర్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు జిన్నా టవర్ చుట్టూ కంచెను ఏర్పాటు చేసి రక్షణ వలయాన్ని నిర్మించారు. ఇక తాజాగా జిల్లా అధికార యంత్రాంగం జిన్నా టవర్ విషయంలో అత్యంత సమర్థవంతంగా, మరో తెలివైన నిర్ణయం తీసుకుంది. స్థానిక నాయకత్వంతో పాటు అధికార యంత్రాంగం జిన్నా టవర్ జోలికి ఎవరూ రాకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్ వేసింది.

గుంటూరులో స్వాతంత్రానికి పూర్వం జిన్నా రాకకు గుర్తుగా జిన్నాటవర్
అసలు జిన్నా టవర్ విషయానికి వస్తే గుంటూరు నగరంలో జిన్నా రాకకు గుర్తుగా జిన్నా టవర్ ను ఏర్పాటు చేశారు. మహమ్మద్ అలీ జిన్నా గుంటూరులో స్వాతంత్ర్యానికి పూర్వం బహిరంగ సభకు వచ్చేందుకు సిద్ధం కాగా, ఆయన పర్యటన చివరి క్షణాల్లో రద్దయింది. గుంటూరు నగరంలో ఆయన పర్యటించకపోవడంతో, ఆయన పేరుమీద జిన్నా టవర్ ను ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఆ సెంటర్ జిన్నా టవర్ సెంటర్ గా గుర్తింపు పొందింది.

జిన్నా టవర్ ను కూల్చివేస్తామని బీజేపీ నేతల వార్నింగ్
ఇక ఈ జిన్నా టవర్ పై గత కొంత కాలంగా బిజెపి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మహమ్మద్ అలీ జిన్నా దేశవిభజనకు కారణమయ్యారని, అలాంటి వ్యక్తి పేరు మీద టవర్ ఉండటాన్ని తాము అంగీకరించబోమని బిజెపి నేతలు చెబుతున్నారు. జిన్నా టవర్ పేరు మార్చి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని వాదనను సైతం బిజెపి నేతలు తెరమీదకు తెచ్చారు. అయితే అందుకు ప్రభుత్వం ససేమిరా అంది. దీంతో జిన్నా టవర్ పేరు మార్చకుంటే కూల్చివేస్తామని బిజెపి నేతలు హెచ్చరికలు జారీ చేశారు.

హిందూవాహిని ఆధ్వర్యంలో జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగరేసే యత్నం
అంతేకాదు హిందు వాహిని ఆధ్వర్యంలో జిన్నా టవర్ పై జాతీయ జెండాను ఎగుర వేయటం కోసం కూడా ప్రయత్నం చేశారు. జాతీయ జెండా ఎగరవెయ్యటానికి ప్రయత్నించిన వారిని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆపై జిన్నా టవర్ కు రక్షణా వలయాన్ని ఏర్పాటు చేశారు.
ఇక జిన్నా టవర్ పై నిత్యం వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించిన అధికార యంత్రాంగం తెలివైన నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ మేయర్ మనోహర్, స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా, మరికొంత మంది నేతలు నిన్నటి వరకు జాతీయ జెండాలోని రంగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video

వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా అధికారుల నిర్ణయం .. జాతీయ జెండా రంగులేసి 3న జెండా వేడుక
ఈ క్రమంలోనే గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్ కు జాతీయ జెండాలోని రంగులు వేశారు. 5 లక్షల రూపాయలతో జిన్నా టవర్ సెంటర్ సుందరీకరణ పనులు చేపట్టారు. అంతేకాదు ఈ నెల 3వ తేదీన జిన్నా టవర్ పై జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించారు. జిన్నా టవర్ పై ఫిబ్రవరి 3వ తేదీన జాతీయ జెండా ఎగుర వేస్తామని మేయర్ మనోహర్ వెల్లడించారు.
దీంతో గత కొంతకాలంగా మహమ్మద్ అలీ జిన్నా పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ జిన్నా టవర్ కూల్చివేస్తామని చెప్పిన బీజేపీ నేతల వ్యూహానికి చెక్ పెట్టినట్లు అయింది అని వైసీపీ నేతలు భావిస్తున్నారు .












Click it and Unblock the Notifications