జొమాటలో, స్విగ్గీకి పోటీగా ONDC
ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ మధ్య మార్కెట్ లో ఎటువంటి పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎన్ని కంపెనీలు వచ్చినా ఈ రెండే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ రెండు కంపెనీలకు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) సవాల్ విసురుతోంది. ప్రభుత్వ ఇ కామర్స్ ప్లాట్ ఫామ్ అయిన ఓఎన్ డీసీలో తక్కువ ధరకే ఆహారం లభ్యమవుతోందంటూ యూజర్లు స్క్రీన్ షాట్లు తీసి పోస్ట్ చేస్తున్నారు.
హోరెత్తుతోన్న సోషల్ మీడియా: కొన్ని రోజులుగా ఈ వార్తతోనే సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఆహార విభాగంలో రోజువారీ డెలివరీల సంఖ్య 10వేల మైలురాయిని సైతం తాజాగా ONDC అందుకుంది. ఇ-కామర్స్ విభాగంలో కొన్ని ప్రయివేటు కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్‌పెడుతూ ఓఎన్‌డీసీని ప్రభుత్వం ప్రారంభించింది. థర్డ్ పార్టీ యాప్స్‌తో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ వేదికగా ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ సహా 240కి పైగా నగరాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు.

డెలివరీ ఛార్జీలు అదనంగా..: సోషల్ మీడియావల్ల రోజురోజుకు ఇది విపరీతమైన ఆదరణ పొందుతోంది. రెస్టారెంట్లకు, హోటళ్లకు నేరుగా వెళ్లినప్పుడు అక్కడ పదార్థాల ధరలకు, ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఉండే ధరలకు చాలా తేడా ఉంటుంది. దీనికితోడు అదనంగా డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తారు. స్విగ్గీ, జొమాటోలో లభించే ఆహారానికి, ఓఎన్‌డీసీ వేదికగా లభించే ఆహార పదార్థాల ధరలతో పోలుస్తూ కొందరు వినియోగదారులు స్క్రీన్‌షాట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు..?: స్విగ్గీ, జొమాటో లా ఓఎన్‌డీసీకి ప్రత్యేకంగా యాప్ లేదు. మనకు ఏదైనా కావాలంటే బయ్యర్ యాప్స్‌లోకి వెళ్లి కొనాలి. పేటీఎం, మైస్టోర్, పిన్‌కోడ్, స్పైస్ మనీ వంటి యాప్స్ ప్రస్తుతం బయ్యర్ యాప్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకు పేటీఎం యాప్‌లోకి వెళ్లి ONDC అని సెర్చ్ చేసి.. ఆహార విభాగంలో మీకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఓఎన్‌డీసీ కొత్తది కావడం వల్ల అన్ని రెస్టారెంట్లు, అన్ని పిన్‌కోడ్స్‌లో అందుబాటులో లేవు. భవిష్యత్‌లో ఈ సేవలు మరింత విస్తృతమయ్యే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications