నేడు పవన్- చంద్రబాబు డిన్నర్ మీట్; రేపు భోగి వేడుకల్లో ఇరువురు నేతలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం జరుగుతున్న సంక్రాంతి పండుగ అందరూ చాలా ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో జరుగుతున్న సంక్రాంతి పండుగ కొత్త రాజకీయ సమీకరణాలను తెరమీదకి తెస్తుంది అన్న చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి రావడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు, వేస్తున్న వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలలో వైసిపి ఓటమి ధ్యేయంగా పనిచేస్తుంటే, వైసిపి ఇప్పటికే నియోజకవర్గాల వ్యాప్తంగా సమన్వయకర్త లను ప్రకటించి, అభ్యర్థులను ఫైనలైజ్ చేసింది. అసంతృప్తులను బుజ్జగిస్తూ, పక్క పార్టీలలో చేరుతున్న వారిపై చర్యలను తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అయితే టిడిపి జనసేన కూటమి పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతోంది.

ఈ క్రమంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. చంద్రబాబు నివాసంలో రాత్రి 8గంటలకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇంటికి డిన్నర్ మీట్ కు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల అధినేతలు ఉమ్మడి మేనిఫెస్టోపైన, సీట్ల పంపిణీ పైన, ఎవరు ఎన్ని స్థానాలలో ఎక్కడెక్కడ నుండి పోటీ చేయాలి అనే అంశాల పైన క్లారిటీ కి వచ్చే అవకాశం ఉంది.
అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సంక్రాంతి పండుగ సంబరాలు మొదలైన వేళ, ఏపీలో సంక్రాంతి సంబరాలను ఇరువురు నేతలు కలిసి ప్రారంభిస్తారు. రేపు భోగి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మందడం లోని గోల్డెన్ రూల్ స్కూల్లో జరగనున్న భోగి వేడుకలలో పాల్గొంటారు.
ఏపీలో వైసీపీ సర్కార్ తెచ్చిన ప్రజా వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఇక ఈ రోజు రాత్రి డిన్నర్ మీట్లో దాదాపు రెండు గంటల పాటు వీరి చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.












Click it and Unblock the Notifications