మూడు రోజుల జనసేన ప్లీనరీ కాస్తా ఒక్కరోజే ? కీలక కారణాలు..!
ఏపీలో గతంలో విపక్షంలో ఉన్నప్పుడు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే వారు. ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగాలు ఉర్రూతలూగించేవి. అంతే కాదు ఈ ప్రసంగాల్లో పవన్ రాజకీయ వ్యూహాలు కూడా అందరికీ తెలిసేవి. ఆ విధంగా పవన్ హింట్స్ ఇచ్చేవారని కూడా చెబుతారు. అయితే ఇప్పుడు తొలిసారి జనసేన అధికారంలో ఉండటంతో ఆవిర్భావ దినోత్సాన్ని కాస్తా ప్లీనరీగా మార్చి మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తాజాగా దీనిపై యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ తొలిసారి గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్లీనరీ కోసం ఏర్పాట్లు నెల రోజుల క్రితమే మొదలయ్యాయి. ఇప్పటికే ప్లీనరీ సక్సెస్ చేసేందుకు పార్టీ తరఫున 14 కమిటీలను కూడా నియమించారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ రెగ్యులర్ గా పిఠాపురం వెళ్లి జనసేన నేతలతో భేటీ అవుతూ ప్లీనరీపై సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్లీనరీ మూడు రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించిన విషయం బయటపడింది.

గతంలో మూడు రోజుల పాటు అట్టహాసంగా ప్లీనరీ నిర్వహించాలని భావించిన జనసేన పార్టీ ఇలా హఠాత్తుగా ఎందుకు వెనక్కి తగ్గిందనే దానిపై జనసైనికులతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంద. అయితే పార్టీ మాత్రం ఇప్పటివరకూ దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్ కానీ, కందుల దుర్గేష్ కానీ, ఇతర నేతలు కానీ తమ ప్రకటనల్లో మాత్రం మార్చి 14న జరిగే ప్లీనరీ అనే చెప్పడం మొదలుపెట్టారు. దీంతో మూడు రోజుల ప్లీనరీ ఒక్క రోజుకు పరిమితమవుతోందని అర్దమవుతోంది.
అయితే దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో అసెంబ్లీ సమావేశాలు, పవన్ ఆరోగ్యం, వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 వరకూ ఉన్నాయి. మధ్యలో మూడు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించి రాజకీయ ప్రసంగాలు చేయడం సరకాదనే భావన వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అలాగే అధినేత పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన మూడు రోజుల పాటు ఇందులో పాల్గొనే అవకాశాలు లేవు. అలాగే వివిధ వర్గాల నుంచి మూడు రోజుల ప్లీనరీకి బదులు ఒక రోజు సరిపోతుందనే సలహా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జనసేన రూటు మార్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications